Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంఘాల నేతలు
నవతెలంగాణ-ముషీరాబాద్
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్యపై కొందరు అనాలోచిత వ్యాఖ్యలు చేయడం అర్థరహితం అని బీసీ సంఘాల నేతలు విమర్శించారు. 45 ఏండ్లుగా అలుపెరుగని పోరాటల యోధుడిగా అనేక సామాజిక ఉద్యమాలను నిర్మించి దేశవ్యాప్తంగా బీసీలకు ఐకాన్ నిలిచారన్నారు. మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలను బీసీ గురుకులాలుగా ప్రకటించాలని ఆర్.కష్ణయ్య ప్రభుత్వాన్ని కోరడంపై కొందరు బీసీ నాయకులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడాన్ని ఖండిస్తూ బీసీ ఐక్య వేదిక అధ్యక్షులు జి.అనంతయ్య, బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు చెరుకుల రాజేందర్ ఆధ్వర్యంలో మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ ఫ్రంట్ చైర్మెన్ గొరిగె మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ బీసీలు తమ ఉనికిని, అస్తిత్వాన్ని గ్రామస్థాయిలో మరింత ప్రచారం చేసేందుకు మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలను బీసీ గురుకులాలుగా పేరు మార్చాలని ప్రభుత్వాన్ని కోరిన మాట వాస్తవమేనని అన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ గురుకులాలకు సమాన స్థాయిలో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులాలు ప్రాధాన్యతను పొందలేదన్నారు. సమాజంలో బీసీ సామాజిక వర్గాల ప్రజలు బీసీ అనే పదాన్ని సగర్వంగా చెప్పుకోవాలన్నారు. ఈ క్రమంలోనే బీసీలకు అనాదిగా వస్తున్న ఆత్మన్యూనత తొలగి, సామాజిక, రాజకీయ రంగాల్లో చైతన్యవంతమైన పాత్ర పోషిస్తారని వివరించారు. బీసీ ఉద్యమ నేత ఆర్.కష్ణయ్య ఆలోచనా విధానాలను అర్థం చేసుకోలేని వారికి ఆయన్ను విమర్శించే అర్హత, స్థాయి లేదన్నారు. సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు జిల్లపల్లి అంజి, బీసీ జేఏసీ చైర్మెన్ రామ్మూర్తి గౌడ్, వివిధ బీసీ సంఘాల నాయకులు నర్సింహ్మ గౌడ్, బీసీ మహిళా సంఘం చైర్పర్సన్ దీపిక, శివకుమార్, మహేష్ గౌడ్, బబ్బు గౌడ్, కట్ట తదితరులు పాల్గొన్నారు.