Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేకపోతే సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తాం
- ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
సీఎం కేసీఆర్ ఓసీ పేదల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను ఆగస్టు 15లోగా నెరవేర్చాలని, లేకపోతే సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు హెచ్చరించారు. మంగళవారం బషీర్‌బాగ్‌లోని ఓసీ సమాఖ్య రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రూ.5 వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్, రూ.1,000 కోట్లతో వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఓసీ పేదల సంక్షేమం కోసం రూ.1,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. 75 ఏండ్ల స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాలు నిర్వహించుకుంటున్న తరుణంలో ఓసీలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆగస్టు15 లోగా సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని, సీఎం క్యాంపు కార్యాలయంతో పాటు టీఆర్ఎస్ మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో రెడ్డి సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు అప్పమ్మగారి రాంరెడ్డి, వైశ్య సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బుస్సా శ్రీనివాస్, బ్రాహ్మణ సంఘాల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు వల్లూరి పవన్ కుమార్, కమ్మ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు గంగవరపు రామకష్ణ ప్రసాద్, వెలమ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చెన్నమనేని పురుషోత్తమరావు, ఓసీ జేఏసీ జాతీయ సలహాదారులు పెండ్యాల కేశవరెడ్డి, ప్రధాన కార్యదర్శి గోపు జయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.