Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్లాస్టింగ్ వల్ల ఎప్పుడు ఏ రాయి పడుతదో తెల్వదు
- సొంత పొలాల్లోకి వెళ్లాలంటేనే భయమైతాంది
- రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోరుకుమార్ ఎదుట ప్రజల ఆవేదన
- మైనింగ్ జోన్ ఎత్తేసి న్యాయం చేయాలని డిమాండ్
- బండరావిరాల మైనింగ్ జోన్లో ప్రజాభిప్రాయ సేకరణ
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్‌మెట్
'మైనింగ్ మా ప్రాణం మీదికొచ్చింది. బయటికెళ్తే బ్లాస్టింగు వల్ల ఎప్పుడు ఏ రాయి మీద పడుతుందో తెల్వదు. మా పొలాలకు పోవాల్నంటే కూడా భయమైతాంది. వద్దు సారూ.. మా ఇలాకాల్లో మైనింగ్‌జోన్ ఎత్తేయండి.. మా ప్రాణం కాపాడండి. న్యాయం చేయండి' అంటూ మైనింగ్ జోన్ భూబాధితులు కలెక్టర్ ఎదుట వాపోయారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోరు కుమార్ సమక్షంలో అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బండరావిరాల గ్రామంలో సర్వే నెం.268లో మైనింగ్ జోన్ నిర్వహణపై మంగళవారం అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా స్థానికులు తమ ఆవేదన వెలిబుచ్చారు.
మైనింగ్‌జోన్ వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు, భూములు కోల్పోయిన వారు తమ ఆవేదనను, అభిప్రాయాలను వెల్లడించారు. తమ ప్రాణానికి హాని కలిగించే మైనింగ్‌ను ఇక్కడి నుంచి తొలగించాలని కోరారు. అక్రమ మైనింగ్ వల్ల సహజ వనరులు కొల్లగొట్టడుతున్నారని, దీంతో తమ బతుకులు ఆగమౌవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మైనింగ్ జోన్ పక్కనున్న తమ పొలాల్లోకి వెళ్లాలంటే భయంగా ఉంటోందన్నారు. బ్లాస్టింగ్ శబ్దాలతో చిన్నపిల్లలు అవిటివారిగా మారుతున్నారని, దుమ్మూ ధూళి కారణంగా ఊపిరితిత్తుల సమస్యతో పరిసరాల ప్రజలమంతా అవస్థ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రోగాల బారినపడి పలువురు మృతిచెందినట్టు తెలిపారు. మైనింగ్ జోన్ కింద భూములు కోల్పోయిన భూనిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇప్పటి వరకు నష్టపరిహారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మైనింగ్ అనుకూల పెయిడ్ కూలీలు
ఓ వైపు ప్రజాభిప్రాయ సేకరణలో స్థానికులంతా మైనింగ్జోన్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న సమయంలో.. కొంతమంది పెయిడ్ కూలీలు అక్కడికి వచ్చి మైనింగ్ నిర్వాహకులకు అనుకూలంగా నినదించారు. సేవ్ క్రషర్, సేవ్ ఫ్యూచర్, ఇండిస్టీస్ రావాలి, ఉపాధి కావాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం వీరు నిర్వాహకుల నుంచి రెండు నుంచి, ఐదు వేలదాకా తీసుకుంటుండగా బీఎస్సీ నాయకులు పట్టుకొని నిలదీశారు. కూలికి వచ్చామని, రెండు వేల నుంచి ఐదు వేలు ఇస్తామంటే వచ్చామని వారు వాపోయారు. రైతులను మోసం చేస్తూ అధికారులను తప్పుదోవ పట్టిచ్చిన మైనింగ్ నిర్వాహకులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఆర్డీవోను స్థానికులు, బీఎస్సీ నాయకులు కోరారు. తగిన న్యాయం చేస్తామని అధికారులు, కలెక్టర్ వెళ్లిపోయారు.
ఏమిటీ మైనింగ్ మాఫియా?
నాలుగు దశాబ్దాల కిందట రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, బండరావిరాల గ్రామ రెవెన్యూ సర్వే నెం.268లో సుమారుగా 670 ఎకరాల దళితుల భూములను నాటి ప్రభుత్వం మైనింగ్ జోన్ కింద లాక్కున్నది. సుమారు 209 మంది రైతులు తమ భూములు కోల్పోయి రోడ్డున పడ్డారు. అప్పటి నుంచి నష్టపరిహారం కోసం పోరాడుతూనే ఉన్నారు. మంత్రులు పలు దఫాలుగా హామీ ఇచ్చినా రైతులకు ఇప్పటికీ న్యాయం చేయలేకపోయారు. న్యాయం కోసం పోరాడిన వారిలో కొంత మంది రైతులు చనిపోయారు కూడా. గతంలో బాటసింగారంలో లాజిస్టిక్ పార్కు ప్రారంభోత్సవంలో భూ బాధితులకు/ రైతులకు న్యాయం చేస్తానని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ కూడా నెరవేర్చలేదు. తమకు న్యాయం చేయాలని మైనింగ్ ప్రాంతంలో రైతులు పెద్దఎత్తున రోడ్డుపైకి వచ్చి ధర్నా చేపట్టారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. మైనింగ్ నిర్వాహకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులను మేనేజ్ చేస్తూ.. నష్టపరిహారంపై భూ బాధితులను మభ్యపెడుతూ వస్తున్నారు. సమస్య రోజురోజుకూ తీవ్రస్థాయికి చేరుతుండటంతో చివరికి అభిప్రాయ సేకరణ పెట్టారు.
ప్రభుత్వానికి ప్రజాభిప్రాయ నివేదిక ఇస్తాం
బండిరావిరాల గ్రామంలోని సర్వే 268లో కొత్తగా క్రషర్ ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రజాభిప్రాయాన్ని సేకరించాం. ప్రజలు వెల్లడించిన అభిప్రాయాలను ప్రభుత్వానికి, సంబంధిత మంత్రులకు అందజేస్తాం.
-కలెక్టర్ అమోరుకుమార్ , రంగారెడ్డి జిల్లా