Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) నగర కమిటీ సభ్యులు ఆర్.వెంకటేష్
నవతెలంగాణ-మెహదీపట్నం
పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తక్షణమే కేటాయించాలని సీపీఐ(ఎం) నగర కమిటీ సభ్యులు ఆర్.వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం గుడిమల్కాపూర్ డివిజన్ బుడగ జంగం బస్తీలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ(ఎం) నగర కమిటీ సభ్యులు ఆర్.వెంకటేష్, నాంపల్లి జోన్ కార్యదర్శి మల్లేష్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు గడిచినా టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందని విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అంటూ హడావుడి చేసి మళ్లీ వచ్చే ఎన్నికల వరకు సాగదీయడం టీఆర్ఎస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం నాంపల్లి నియోజకవర్గం ఆసిఫ్ నగర్ మండల పరిధిలో ఆన్లైన్లో 37,690 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని ప్రభుత్వం లెక్కలో చూపుతున్నదన్నారు. కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయంలో నేరుగా ఇచ్చిన దరఖాస్తులను కలిపి లబ్దిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. భోజగుట్టలో మొదలుపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వెంటనే పూర్తి చేయాలన్నారు. అలాగే భోజగుట్టలో ముస్తాఫ్ సొసైటీ, అయోధ్య నగర్ సొసైటీల పేరుతో కబ్జా చేసిన ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేద ప్రజలకు ఇండ్ల కోసం కేటాయించాలని కోరారు. అంబేద్కర్ నగర్లో నివసిస్తున్న పేదలకు సొంత ఇంటి నిర్మాణం కోసం రూ.10 లక్షలు ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. బుడగ జంగం బస్తీలో నివసిస్తున్న స్వచ్ఛ ఆటో కార్మికులకు అక్కడే ప్రభుత్వం ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో పేదలందరినీ కలుపుకొని ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని కోరుతూ ఆగస్టు ఒకటో తేదీన ఆసిఫ్ నగర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ (ఎం) ఆధ్వర్యంలో జరగబోయే ధర్నాలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీపీఐ (ఎం)నాయకులు లక్ష్మణ్, పక్కిర్, గౌస్, సత్తెమ్మ, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.