Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తెల సజన
- హనుమకొండలో రాష్ట్ర మహాసభలు
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర ముప్పు వాటిల్లే మోడీ ప్రభుత్వ విభజన విధానాలపై ఉద్యమిస్తామని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తెల సృజన, ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి అన్నారు. భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) రెండో రాష్ట్ర మహాసభలు హనుమకొండలో ఆగస్టు 28, 29, 30వ తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. మంగళవారం హిమాయత్‌నగర్ అమత ఎస్టేట్స్‌లోని రాష్ట్ర కార్యాలయంలో మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఉస్తెల సజన మాట్లాడుతూ ఎనిమిదేండ్ల మోడీ పాలనలో మహిళల స్థితిగతులు పూర్తిగా క్షీణించాయని, హక్కులు కాలరాయబడ్డాయని, సమానత్వం లేకుండా పోయిందని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఉపాధి హామీ పథకం నిధులను కుదించి గ్రామీణ మహిళల జీవనాధారాన్ని నాశనం చేసిందని మండిపడ్డారు. మరో వైపు ఆకాశాన్నంటిన ఇంధన, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వల్ల పేద కుటుంబాలకు చెందిన మహిళలు ఎక్కువగా ప్రభావితమవుతున్నారన్నారు. మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతరేక విధానాలను నిరసిస్తూ పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని, అలాగే ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాడానికి మహిళలు ఎల్లప్పుడు ముందుండాలని ఆమె కోరారు. అనంతరం నేదునూరి జ్యోతి మాట్లాడుతూ ఆగస్టులో హనుమకొండలో జరగబోయే మూడు రోజుల మహాసభలలో పార్లమెంటు, శాసన సభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల, రాజ్యాంగ పరిరక్షణ, మహిళల హక్కులు, ధరల పెంపుదలకు వ్యతిరేకంగా, పని ప్రదేశాల్లో మహిళలకు భద్రత, ఉచిత నిర్బంధ విద్య, నిరుద్యోగం, మహిళలపై హింసతో సహా పలు తీర్మానాలు ప్రవేశపెడుతామని తెలిపారు. 33 జిల్లాల నుంచి దాదాపు 500 మంది ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరవుతారని, మొదటి రోజు ఆగస్టు 28న జండా ఆవిష్కరణ, అమరవీరులకు నివాళులు అనంతరం మహాసభలను ఎన్ఎఫ్ఐ డబ్ల్యూ జాతీయ ప్రధాన కార్యదర్శి అని రాజా ప్రారంభిస్తారని, 29న ప్రతినిధుల సభ, 30న వేయిస్తంభాల గుడి నుంచి పబ్లిక్ గార్డెన్స్ వరకు వేలాది మంది మహిళలచే భారీ ర్యాలీ, బహిరంగ సభ జరుగుతుందని వెల్లడించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆమె కోరారు. సమావేశంలో ఎన్ఎఫ్ఐ డబ్ల్యూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.సదాలక్ష్మి, ఉపాధ్యక్షురాలు ఎస్.ఛాయాదేవి, కోశాధికారి ముడుపు నళినిరెడ్డి, మహిళా నాయకులు జంగమ్మ, పూర్ణిమ, కరుణ కుమారి, సుగుణ తదితరులు పాల్గొన్నారు.