Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ నగర కార్యదర్శి ఎం. వెంకటేశ్
- ఆగస్టు 3న నిర్వహించనున్న మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ-సిటీబ్యూరో
కనీస వేతనాల జీఓలను సవరించాలని ఆగస్టు 3న సీఐటీయూ ఆధ్వర్యంలో ఇందిరాపార్కువద్ద ధర్నా నిర్వహిస్తున్నట్టు సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్ తెలిపారు. ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం సీఐటీయూ నగర కార్యాలయంలో ధర్నా వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ... రాష్ట్రంలో కనీసవేతన చట్టం పరిధిలోని 73 షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్ ఉన్నాయని, వీటిలో సుమారు కోటి మందికిపైగా కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. ప్రతీ ఐదేండ్లకొకసారి పెరిగిన ధరలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు సవరించాల్సి ఉండగా ఎనిమిదేండ్లుగా రాష్ట్ర కార్మికుల వేతనాలను సవరించలేదన్నారు. కార్మికుల పోరాటం ఫలితంగానే 2021 జూన్‌లో 5 జీఓలను సవరించిన ప్రభుత్వం గెజిట్ చేయకుండా ఆపేసిందన్నారు. బీడీ, హమాలీ, భవన నిర్మాణం, ట్రాన్స్‌ఫోర్ట్ రంగాల కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఎన్నిసార్లు కోరినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పారు. మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తెచ్చిందన్నారు. ఇదీ యజమాన్యాల లాభం కోసమేనని, కార్మిక వర్గం మరింత శ్రమో దోపిడీకి గురవుతోందని, 12 గంటల పని చట్టబద్దమవుతుందని అన్నారు. కనీస వేతన జీవోల సవరణ, హమాలీ, భవన నిర్మాణం, ట్రాన్స్‌ఫోర్ట్ రంగాల కార్మికుల సమస్యల పరిష్కారం, 4 లేబర్ కోడ్ల రద్దు కోసం ఆగస్టు 3న ఇందిరాపార్కు వద్ద జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సీఐటీయూ నగర అధ్యక్షులు కె.ఈశ్వర్రావు, ఉపాధ్యక్షులు జె.కుమారస్వామి, శ్రామిక మహిళా కన్వీనర్ ఆర్.వాణి, నగర కమిటీ సభ్యులు పి.పుల్లారావు, ఎం.సుజాత, ఎ.శ్యామలీల, మహేష్ తదితరులు పాల్గొన్నారు.