Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
సమాజంలో నీతిగా, నిజాయితీగా పని చేసి, పని చేస్తున్న అధికారుల సమాచారాన్ని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థకు అందించాలని సంస్థ సలహాదారులు, ప్రముఖ సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్ అన్నారు. గురువారం యూత్ ఫర్ యాంటీ కరప్షన్ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు.. సమాజంలో అవినీతి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉందని, అవినీతిని నిర్మూలించే క్రమంలో నిజాయితీగా పని చేసే వారిని గుర్తించి సత్కరించడం కూడా చాలా అవసరమన్నారు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక వినూత్న కార్యక్రమాలతో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ 12 ఏండ్ల నుంచి అవినీతి రహిత సమాజం కోసం పని చేస్తోందని, అవినీతిని ప్రశ్నించడమే కాకుండా, నీతిగా, నిజాయితీగా పని చేస్తున్న వారిని గుర్తించి, వారికి సత్కరిస్తుందన్నారు. నిజాయితీపరులను నేటి సమాజానికి పరిచయం చేయడం వల్ల నిజాయితీపరుల సంఖ్య పెరగడమే కాకుండా రాబోయే యువతరానికి స్ఫూర్తిగా ఉంటారని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అలాంటి అధికారుల సమాచారం వైఏసీ సంస్థకు అందించాలన్నారు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ పౌండర్ రాజేంద్ర పల్నాటి మాట్లాడుతూ.. రాజకీయాల్లో నిజాయితీపరులను, ప్రభుత్వ అధికారుల్లో నిజాయితీపరులను, గ్రామాభివద్ధి కోసం పని చేస్తున్న వారిని గుర్తించే కార్యక్రమాలు దేశంలోని మొదటిసారిగా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ చేస్తుందన్నారు. అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఏడాదీ విడుతల వారీగా ఈ కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఆగష్టు 28వ తేదీ అదివారం నిజాయితీ అధికారుల కార్యక్రమం హైదరాబాద్లో నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ బందం కానుగంటి రాజు, డా. స్రవంతి, శ్రీజ, వరికుప్పల గంగాధర్, కొమటి రమేష్ బాబు, మూడావత్ రమేశ్, జి. హరిప్రకాశ్, బత్తిని రాజేశ్, శివనాగరాజు, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.