Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గంటకుపైగా ఏకధాటిగా వానతో రోడ్లు, కాలనీలు జలమయం
- ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్, ఇబ్బందులు ఎదుర్కొన్న వాహనదారులు
- నేరెడ్‌మెట్‌లో 9.5 సెం.మీ నమోదు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఒక్కసారిగా మొదలై ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుతో ప్రారంభమైన వర్షం శుక్రవారం నగర వాసులను ఆందోళనకు గురిచేసింది. ఏకధాటిగా గంటకు పైగా వర్షం కురవడంతో రోడ్లు, కాలనీలు జలమయం అయ్యాయి. భారీగా వరద ప్రవహించింది. ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కుండపోవవానతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని గడిపారు. జీహెచ్ఎంసీ వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలకు ఉపక్రమించింది.
గ్రేటర్ పరిధిలోని కూకట్పల్లి, హైదర్‌నగర్, ప్రగతినగర్, బాచుపల్లి, దిల్సుఖ్నగర్, సరూర్‌నగర్, మలక్‌పేట, చాదర్‌ఘాట్, ముషీరాబాద్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్, బాలానగర్, గాజులరామారాం, సూరారం, అంబర్‌పేట, గచ్చిబౌలి, టోలిచౌకి, నేరేడ్మెట్, కుషాయిగూడ, రాయదుర్గంతోపాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. హయత్‌నగర్, వనస్థలిపురంలో ఉరుములూ మెరుపులతో వాన దంచికొట్టింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, మణికొండ, షేక్‌పేట, టోలీచౌకి, రాయదుర్గం, గచ్చిబౌలిలో భారీగా వర్షం కురిసింది. ఇక సికింద్రాబాద్‌లో కురిసిన వర్షానికి కాలనీలు, బస్తీలు నీట మునిగాయి. గంటకు కపైగా ఏకధాటిగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. మోకాళ్ల లోతుకుపైగా వరద చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల ద్విచక్ర వాహనాలు సగం వరకు నీట మునిగాయి. నల్లని మేఘాలు ఆకాశాన్ని కప్పేయడంతో సిటీలో చీకట్లు కమ్ముకున్నాయి. ఒక్కసారిగా వర్షం కురవడంతో రాకపోకలు సాగించే పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉండగా.. రాబోయే రెండు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది.
నేరెడ్‌మెట్‌లో 9.5 సెం.మీ వర్షం
కుండపోత వర్షం కారణంగా నేరెడ్‌మెట్‌లో 9.5సెం.మీ భారీ వర్షపాతం నమోదైంది. ఈస్ట్ ఆనంద్‌బాగ్‌లో 7.3, మల్కాజ్‌గిరిలో 6.7, తిరుమలగిరిలో 6.3, హయత్‌నగర్‌లో 6.2, ఏఎస్‌రావునగర్‌లో 6, కుషాయిగూడలో 5.9, ఆల్వాల్‌లో 5.8, ఫతేనగర్‌లో 5.5, వెస్ట్‌మారేడ్‌పల్లిలో5.3, బేగంపేట్‌లో 5, మోండామార్కెట్లో 4.7, సీతాఫల్మండిలో 4.6, మౌలాలిలో 4.5, ఎల్బీనగర్లో 4.5సెం.మీ వర్షపాతం నమోదైంది. ఎల్బీనగర్, చింతల్‌కుంట రహదారిపై మోకాళ్లలోతు నీరు పోవడంతో ద్విచక్రవాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బేగంపేట్‌లోని ప్రకాష్‌నగర్‌లో కాలనీ నీటమునిగింది. మూసీకి వరద ఉధృతి కొనసాగుతుండటంతో ముసారాంబాగ్ బ్రిడ్జీపై రాకపోకలను బంద్ చేసిన విషయం తెలిసిందే.