Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆకాశాన్నంటుతున్న గ్యాస్‌బండ ధరలు
- ఎల్పీజీ రూ.1150, కమర్షియల్ రూ.3వేలు
- సబ్సిడీలోనూ తప్పని కోత
- మరోవైపు మండుతున్న నిత్యావసరాలు
- మహిళలకు తప్పని వంటింటి కష్టాలు
నవతెలంగాణ-అడిక్ మెట్
ఒకవైపు పెరుగుతున్న ధరలు.. మరోవైపు తగ్గుతున్న తలసరి ఆదాయం, ఆదాయన్ని పెంచే ఉపాధి అవకాశాలు లేకపోవడంతో నేడు ప్రతీ పేద, మధ్య తరగతి కుటుంబం సఫర్ అవుతోంది. ప్రతి ఇంట్లో పెరిగిన సిలిండర్ ధరతో వంటగ్యాస్ కష్టాలు తప్పడం లేదు. రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలతో పాటు గ్యాస్ ధరలు పైపైకి ఎగబాకుతూ ప్రజలకు కష్టాలు తెచ్చిపడెతున్నాయి. ఇప్పటికే పెరిగిన వంటగ్యాస్ ధరలతో వినియోగదారులు మరింత ఆర్థికంగా కృంగిపోతున్నారు. వీటికి తోడు పెట్రోల్, డీజిల్ ధరలతో మరిన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారు.
సామాన్యులపై గుది'బండ
ఇప్పుడిప్పుడే కొంత ఆర్థికంగా అభివద్ధి చెందాలన్న భావనతో కాయకష్టం చేసుకుంటూ ఎంతో కొంత డబ్బును పోగు చేసు కుంటున్న సామాన్య, మధ్య తరగతి ప్రజలకు పెరుగుతున్న సిలిండర్ ధర పెద్ద సమస్యగా మారింది. పేదల ఇండ్లల్లో సమస్య నిప్పురాజేస్తోంది. ఇటీవల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలను పెంచడంతో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర దాదాపు 3000 వుండగా, 14కిలోల వంట గ్యాస్ ధర రూ.1150 కి పెంచారు. ఇలా వరుసగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అమాంతం పెరుగడంతో నిత్యావసరాల ధరలు సైతం ఆకాశాన్ని అంటుతున్నాయి. పట్టించుకోవాల్సిన పాలకులు ధరలు పెంచి సామాన్యులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రోజంతా ఎండనక, వాననక చెమటోడ్చి పని చేసిన పేదలకు కట్టెలపొయ్యితో కష్టాలు తప్పడం లేదు. పెరిగిన ధరలతో గ్యాస్ కొనలేని పరిస్థితి ఏర్పడి సామాన్యులు కట్టెలపొయ్యిని ఆశ్రయించక తప్పడం లేదు.
పట్టించుకోని పాలకులు
2014 మార్చి 1వ తేదీన సిలిండర్ ధర రూ.416 ఉండేది. ఇప్పుడు అది రూ.1150 కి చేరింది. ఈ ధరలతో లోలోపల మగ్గి పోవడం తప్ప, ఈ భారీ పెరుగుదలకు ప్రభుత్వాలను నిలదీసే చైతన్యం సగటు మనిషికి లేకుండా పోతోంది. తగ్గించాలనే ఆలోచన, నియంత్రించాలనే నిబద్ధత పాలకులకు లేదు. డీజిల్, పెట్రోల్ ధరలు కూడా ఇదేతీరున దాదాపు రెట్టింపునకు ఎగబాకడంతో డీజిల్ పెట్రోల్ 110 వరకు చేరాయి. కరోనా కష్టాలు ఒక పక్క, ఉపాధి లేక మరోపక్క నిత్యావసరాల ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగడంతో సామాన్య ప్రజలపై పెనుభా రంగా మారింది.కరోనా కాలంలో ఆహార ధాన్యాలు, ఉచిత సరుకు లు అందజేస్తూ కొవిడ్ కట్టడి కోసం వ్యాక్సిన్లు, ఆరోగ్యపరమైన మౌలిక వసతుల కోసం కోట్లాది రూపాయలు ప్రజల కోసమే వెచ్చి స్తున్నామని చెప్పిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రస్తుతం ప్రజలపై ధరల భారాన్ని మోపుతూ బతకలేని పరిస్థితికి తీసుకొస్తున్నాయి.
ప్రజలకు దక్కని సబ్సిడీ
ఆడబిడ్డల కంట కన్నీరు రాకుండా అల్పాదాయక వర్గాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లను అందించడం కోసమే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం తీసుకొచ్చామని గొప్పలు చెప్పి కేంద్ర సర్కారు ఆడబిడ్డల నెత్తిన గ్యాస్‌బండ రూపంలో గుదిబండను మోపి బాధపెడుతోంది. సబ్సిడీలకు కోతలు విధిస్తూ సామాన్య ప్రజల జీవితాల్లో మంటలు రేపుతోంది. ప్రజలకు ఇచ్చే రాయితీలో భారీగా కోతలు విధిస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఖజానాపై సబ్సిడీ భారాన్ని భారీగా తగ్గించుకుంటూ.. దీంతో గ్యాస్ ధర పెరిగినా ప్రతీసారి సామాన్య ప్రజలే బలికాక తప్పడం లేదు. నాలుగేళ్లలోనే గ్యాస్ సబ్సిడీపై కేంద్రం రూ.25వేల కోట్ల భారాన్ని తగ్గించుకుంటే సామాన్య ప్రజలకు మాత్రం ధరల భారం తప్పడం లేదు. ఓవైపు ధరలు భారీగా పెంచేస్తూ మరోవైపు రాయితీని ఎత్తేస్తుండడంతో సామాన్యుడు విలవిలలాడిపోతున్నాడు.
గ్యాస్ కంటే కట్టెల పొయ్యి నయమనిపిస్తోంది : తరజి
ప్రస్తుతం గ్యాస్ ధరలు పెరగడంతో సిలిండర్‌పై వంట చేసుకోవడం కష్టంగా మారింది. నాలుగేళ్ల కింద రూ.400 ఉన్న ధర ప్రస్తుతం రూ.1100 అయ్యింది. మరోపక్క నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోతుండటంతో గ్యాస్‌పొయ్యి కంటే కట్టెలపొయ్యి మేలనిపిస్తోంది.
ప్రజలపై ధరల భారం మోపడం సరికాదు : ప్రవీణ
గతంలో జరిగిన రెండు ఎన్నికల్లో ప్రజలకు అన్నివిధాల ధరల భారం లేకుండా చూస్తామన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలతోపాటు వంట గ్యాస్ ధరలనూ పెంచి ప్రజలపై మోయలేని భారం వేయడం సమంజసం కాదు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు సామాన్యులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికైనా పెంచిన పెట్రోల్, డీజిల్, వంట సరుకులు, గ్యాస్ ధరలను తగ్గించాలి. లేదంటే ప్రజలే వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెబుతారు