Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బోయినపల్లి రాము
నవతెలంగాణ-ఓయూ
ఓయూలో ఈనెల 25న యూనివర్సిటీ విద్యార్థుల రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నామని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) రాష్ట్ర అధ్యక్షులు ఎస్.నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బోయినపల్లి రాము తెలిపారు. మంగళవారం ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణం ఎదుట ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తెలంగాణలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు సమస్యలకు నిలయాలుగా మారాయని చెప్పారు. యూనివర్సిటీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం పీడీఎస్‌యూ దశలవారీగా పోరాటం నిర్వహిస్తుందని తెలిపారు. ఆగస్టు 5న విశ్వవిద్యాలయాల సమస్యలపై వైస్ ఛాన్సలర్‌కు వినతిపత్రాలు, ఆగస్ట్ 6 నుంచి 16 వరకు అన్ని యూనివర్సిటీల్లో సదస్సులు, 25న విద్యార్థులతో ఉస్మానియా యూనివర్సిటీలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ యూనివర్సిటీల పరిరక్షణకు తక్షణమే చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే విశ్వవిద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ లేకపోవడంతో నాణ్యమైన విద్య పేద విద్యార్థులకు అందడం లేదని గుర్తు చేశారు. విద్యార్థులకు ఉచిత మెస్ సౌకర్యాన్ని కల్పించాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తుందని విమర్శించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థుల స్కాలర్‌షిప్స్‌ని పెంచాలని, ప్రతి విద్యార్థికి ఫెలోషిప్, ఉచిత మెస్ సౌకర్యం, ఉచిత ఆరోగ్య బీమా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. యూనివర్సిటీల డెవలప్మెంట్ కోసం రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయ విద్యార్థుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా అర్థం చేసుకొని సత్వరమే చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పీడీఎస్‌యూ తెలంగాణ యూనివర్సిటీల కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు స్వాతి, సుమంత్, రుక్మత్ పాషా, ప్రవీణ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు అనిల్, ఓయూ నాయకులు శ్వేత,రాజు, నరేష్, సతీష్, నాగరాజు, సువర్ణ, స్వాతి, మమత, వినోదిని, లక్ష్మీ ప్రసన్న పాల్గొన్నారు.