Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొఫెసర్ రవీంద్రనాథ్ కె మూర్తి
- ఓయూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో ముగిసిన
ఎఫ్ఎల్ఎన్ బేస్‌లైన్ వర్క్‌షాప్
నవతెలంగాణ-ఓయూ
అభ్యాసన సంక్షోభం నుంచి విముక్తి కలిగించేందుకు తొలిమెట్టు కార్యక్రమం తోడ్పడుతుంది అని ఓయూ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రవీంద్రనాథ్ కే మూర్తి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఫౌండేషన్ లిట్రసీ బేస్ లైన్ అసెస్మెంట్ తెలంగాణ-22 పేరుతో రెండు రోజులపాటు నిర్వహించిన వర్క్ షాప్ మంగళవారం ముగిసింది. ఈకార్యక్రమానికి ఉస్మానియా యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ ప్రొ. రవీంద్రనాథ్ కె మూర్తి, ప్రొ. శంకర్ పారుపల్లి హాజరై మాట్లాడుతూ అభ్యాసన సంక్షోభం నుంచి విముక్తి కలిగించేందుకు తొలిమెట్టు కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. అభ్యసన సంక్షోభాన్ని నివారించడానికి దాని మూలాల్లోకి వెళ్లి విద్యార్థులు ఏవిధమైన సమస్యను ఎదుర్కొంటున్నారనే దాని ద్వారా కనుక్కోవడం జరుగుతుందన్నారు. దానికి అనుగుణంగా తగు చర్యలు తీసుకొని సంక్షోభాన్ని నివారించాలనేది ఈ వర్క్ షాప్ ముఖ్య ఉద్దేశం అన్నారు. తెలంగాణలో మొదటిసారిగా విద్యాశాఖలో డిజిటల్ సర్వే జరుగుతుందని, దీని వల్ల కచ్చితమైన ఫలితాలు త్వరగా వస్తాయని తెలియజేశారు. ప్రొఫెసర్స్ మధుకర్, సుజాత, నరేందర్ పాల్గొని ఈ శిక్షణ శిబిరం రెండు రోజులు విజయవంతంగా పూర్తయిందన్నారు. రిసోర్స్‌పర్సన్‌గా వ్యహరించిన ప్రభాకర్ రెడ్డి, లలిత మాట్లాడుతూ విద్యార్థుల అభ్యసన సంక్షోబాన్ని పరిశీలించడానికి ఈ ఎఫ్ఎల్ బేస్‌లైన్ సర్వే సరైన విధంగా ఉపయోగపడుతుందన్నారు. క్షేత్ర పరిశీలకులకు పూర్తిస్థాయిలో తర్ఫీదునివ్వడం జరిగిందని తెలిపారు. వీరు నేటి నుంచి తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్, గణితం భాషాసామర్థ్యాలను పరిశీలించి ఆగస్టు 15లోగా నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి సమర్పిస్తారని వివరించారు.