Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగంలోకి సుపారీ గ్యాంగ్‌లు, పాత నేరస్తులు
- భయాందోళనలో నగరవాసులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ పరిధిలో వరుస హత్యలు సంచలనం రేపుతున్నాయి. రోజూ ఎక్కడో ఒకచోట హత్యలు జరుగుతుండటంతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. భూవివాదాలు, పగలు, ప్రతీకారాలంటూ మానవత్వం మరిచిపోయి నెత్తురు కళ్లజూస్తున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో ఎక్కడో ఒకచోట వరస హత్యలు జరుగుతుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. విచక్షణ కోల్పోయి ఉన్మాదులుగా మారుతున్న నిందితులు తన, మన అనే తేడా లేకుండా దారుణాలకు ఒడిగడుతున్నారు. తండ్రిని చంపారని కక్షపెంచుకుని ఓ రియల్టర్‌ను దారుణంగా హ్యత చేసిన విషయం తెలిసిందే. జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గత నెల15న సుపారీ గ్యాంగ్‌తో హత్య చేసిన సంఘటన సంచలనం రేపింది. ఇదిలావుండగా గత సోమవారం మాదాపూర్ ఠాణా పరిధిలోని నీరూస్ చౌరస్తాలో రియల్టర్‌ను దారుణంగా హత్య చేశారు.
తుపాకులతో సంచారం...
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం రాష్ట్రంలో సంచలనం రేపింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నివాసం దగ్గర ఈ ఘటన జరిగింది. ఆర్మూర్‌కు చెందిన మక్లూర్ మండలం కిల్లెడ గ్రామ సర్పంచ్ లావణ్యను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేయడంతో ఆమె భర్త ప్రసాద్ గౌడ్ ఎమ్మెల్యేపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇంట్లో వెళ్లడంతో ఎమ్మెల్యే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రెండు తుపాకీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆరు నెలల్లో 15కిపైగా హత్యలు
ఈ ఏడాది ఆరునెలల కాలంలో గ్రేటర్లో 15నుకుపైగా దారుణ హత్యలు చోటుచేసుకోవడం సంచలనం రేపింది. నగరం, శివారు ప్రాంతాలనే తేడా లేకుండా నేరస్తులు రెచ్చిపోతున్నారు. పాత నేరస్తులు, రౌడీ షీటర్లను రంగంలోకి దించుతున్నారు. కేవలం నగర కమిషనరేట్ పరిధిలో 2020లో 64 హత్యలు చోటుచేసుకోగా, 2021లో 85 హత్యలు చేసుకున్నాయి. ఈ ఏడాది మూడు కమిషనరేట్ల పరిధిల్లో 15కుపైగా హత్యలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రధాన నిందితులెక్కడా?
ఎప్పటికప్పుడు ఆయుధాలు, వాటిని విక్రయించేందుకు ప్రయత్నించిన వారిని, కొనుగోలు చేసిన వారిని పోలీసులు పట్టుకుంటున్నారే తప్పా ప్రధాన నిందితులను అరెస్టు చేయలేక పోతున్నారు. గ్రేటర్లో అక్రమ ఆయుధ వ్యాపారంపై పోలీసు నిఘా అంతంత మాత్రంగానే ఉండడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి తుపాకులు, తపంచాలను అక్రమ మార్గంలో వచ్చి చేరుతున్నాయి. పూర్తి స్థాయిలో అధికారులు అవి వస్తున్న మార్గాలపై కన్నేసి ఉంచలేకపోతున్నారు. ఫలితంగా ఈ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. ఓ ముఠా దొరికినప్పుడు వారిని అరెస్టు చేయడంతో సరిపెట్టాల్సి వస్తోంది. ఎవరైనా చొరవ తీసుకుని కాస్త ముందడుగు వేసి దర్యాప్తు కోసం రాష్ట్రం దాటినా వారికి అక్కడి పోలీసుల నుంచి సరైన సహకారం అందడం అంతంత మాత్రంగానే ఉందని తెలుస్తోంది. దాంతో ప్రాధాన నిందితులు పోలీసులకు చిక్కడం లేదని సమాచారం.
రెండు రెట్లకుపైగా అక్రమమే...
గత సోమవారం మాదాపూర్ ఠాణా పరిధిలోని నీరూస్ చౌరస్తాలో రియల్టర్లు మధ్య చెలరేగిన వివాదం కాల్పులకు దారి తీసింది. ఇలా రాజధానిలో తరచూ తుపాకీ వినియోగం కలకలం సష్టిస్తోంది. చిన్న వివాదానికీ తుపాకులు, తూటాలు 'తెరపైకి' వస్తున్నాయి. తుపాకులకు సంబంధించిన అత్యధిక నేరాలు అక్రమాయుధాలతోనే జరుగుతున్నాయి. గ్రేటర్లో ఉన్న లైసెన్స్డ్ ఆయుధాలకు వాటికి రెండు రెట్లకుపైగా అక్రమ ఆయుధాలు వినియోగంలో ఉన్నాయన్నది అనధికారిక అంచనా. ఇవి అనేక ప్రాంతాల నుంచి దిగుమతి అవుతున్నట్టు పలు కేసుల్లో తేలింది.
ట్రాన్స్ జెండర్ దారుణ హత్య
ఎల్బీనగర్కు చెందిన దీపిక అంబర్‌పేటకు చెందిన సాయిహర్ష మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. దీపిక బోనాల పండగ సమయంలో సంపాదించిన డబ్బుతో వారు జీవనం సాగించేవారు. దీపిక ఆర్థిక లావాదేవీలు సాయిహర్ష చూసుకునేవాడు. దీపిక గతంలో సాయిహర్ష నుంచి రూ.1.50 లక్షలు అప్పుగా తీసుకుంది. డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో సాయిహర్ష ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో మద్యం తాగించి ఈనెల 21న దీపికను దారుణంగా హత్య చేశారు.
తండ్రిని చంపారని.... సుపారీ గ్యాంగ్‌తో..
జవహర్‌నగర్ పీఎస్ పరిధిలో సంచలనం సష్టించిన రియల్టర్ రఘుపతి హత్య కేసును పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. పదమూడేళ్ల క్రితం తన తండ్రి జంగారెడ్డిని కిరాతకంగా హత్య చేసిన నేపథ్యంలో కక్ష పెంచుకున్న అతని కుమారుడు శ్రీకాంత్ రెడ్డి, రఘుపతిని అంతమొందించేందుకు రూ.30 లక్షలకు కర్ణాటకకు చెందిన కిరాయి గుండాలతో సుపారీ కుదుర్చుకున్నాడు. పథకం ప్రకారం కిరాయి మూకలు ఈనెల 15న దమ్మాయిగూడలోని శివనగర్‌లో రఘుపతిపై వేట కొడవళ్లతో దాడి చేసి హత్య చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీ కాంత్ రెడ్డి, మంజునాథ్‌లతో పాటు సుపారీ గ్యాంగ్ నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.