Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆచార్య పులికొండ సుబ్బాచారి
నవతెలంగాణ-ధూల్‌పేట్
తెలుగు సాహిత్యానికి ప్రాణ చైతన్యాన్ని అందించిన మహాకవుల సంస్కారాన్ని ఈ తరం కవులు, విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సుప్రసిద్ధ సాహితీ వేత్త, పరిశోధకులు ఆచార్య పులికొండ సుబ్బాచారి అన్నారు. ప్రభుత్వ సిటీ కళాశాల, తెలుగు శాఖ నిర్వహించిన దాశరథి, సి.నారాయణరెడ్డి సాహిత్య సమాలోచన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ చైతన్యానికి దాశరథి కవిత్వం ప్రాతిపదికగా నిలిచిందని, చాలా చిన్న వయసులోనే తొలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొనటమే కాకుండా ఉద్యమ ఆశయాలను తన కవిత్వంలో పొందుపరిచారని అన్నారు. సి.నారాయణరెడ్డి బహుముఖీన రచనా స్ఫూర్తితో ఆధునిక తెలుగు కవిత్వంపై చెరగని ముద్ర వేశారని విశ్లేషించారు. పద్యం, గేయం, గేయరూపకం, వచన కవిత్వం, ఘజల్, ప్రపంచపదులు వంటి సాహిత్య ప్రక్రియలద్వారా ఆధునిక తెలుగు కవితా పరిణామాన్ని వేగవంతం చేశారన్నారు. తెలుగులో కర్పూర వసంతరాయలు విలక్షణమైన, విశిష్టమైన కావ్యమని కొనియాడారు. అపురూపమైన ప్రాసలు, యతులు అలవోకగా ఆయన కవిత్వంలో ఒదిగిపోతాయని, ఉర్దూ సాహిత్య ప్రభావంతో వినూత్నమైన లఘు ప్రక్రియలకు సినారె కొత్త మెరుగులు దిద్దారని కొనియాడారు. సినిమాపాటకు కవిత్వ గౌరవాన్ని అందించారని అన్నారు. ఆయన కవిగానే కాకుండా పరిశోధకుడిగా, స్ఫూర్తిదాయకమైన గురువుగా, ప్రభావశీలమైన వక్తగా, పాలనాదక్షుడిగా కూడా పేరు ప్రఖ్యాతలు గడించారని, వారిని స్మరించటం ఇప్పటి తరం వారికిచ్చే నివాళి అని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ డా.పి.బాల భాస్కర్ విద్యార్థులు మహా కవుల రచనలను అధ్యయనం చేయటం ద్వారా పోటీ పరీక్షలలో రాణించవచ్చని అన్నారు. వైస్ ప్రిన్సిపాల్ డా.విప్లవ దత్ శుక్లా మాట్లాడుతూ నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే నినాదం ఎన్నో పోరాటాలకు స్ఫూర్తిమంత్రంగా నిలిచిందని అన్నారు. ఈ సందర్భంగా మహాకవుల చిత్రాలను అద్భుతంగా గీసిన బీఎస్సీ విద్యార్థిని పావనిని అందరూ అభినందించారు. విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. కార్యక్రమంలో బీసీ స్టడీ సర్కిల్ కోర్సు సమన్వయకర్త బాలకృష్ణ, డా.కోయి కోటేశ్వర రావు, డా.జె.నీరజ, అవధానం సుజాత, కేతరీన, సుజాత అజ్మీర, డా.కమల సుధారాణి, డా.అనురాధ తదితరులు పాల్గొన్నారు.