Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్కరోజే 4లక్షల మంది ప్రయాణం
- గణేష్ నిమజ్జనం వేళ మూడు కారిడార్లు కిటకిట
- మియాపూర్-ఎల్బీనగర్ రూట్లో అత్యధిక మంది ప్రయాణం
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ మెట్రో రైల్ సరికొత్త రికార్డును నమోదు చేసింది. గణేష్ నిమజ్జనం వేళ మెట్రోలో ప్రయాణించిన వారి సంఖ్య రికార్డు స్థాయిలో నమోదైంది. గ్రేటర్లో గణేష్ శోభాయాత్ర నేపథ్యంలో మెట్రో అధికారులు మెట్రో ట్రైన్ సర్వీసులను శుక్రవారం అర్థరాత్రి వరకు పొడిగించారు. దీంతో మెట్రో రైల్లో ఆ ఒక్క రోజే దాదాపు 4లక్షల మంది ప్రయాణించారు. మూడు మెట్రో కారిడార్లలోని అన్ని స్టేషన్లు ప్రజలతో కిటకిటలాడాయి. మెట్రో రైళ్లు జనంతో నిండిపోయాయి. అత్యధికంగా మియాపూర్ -ఎల్బీనగర్ కారిడార్‌లో ప్రయాణికులు రాకపోకలు సాగించారని మెట్రో అధికారులు వెల్లడించారు. కరోనాకు ముందు ఈ మూడు కారిడార్లలో 4లక్షల మంది ప్రయాణికులు సరాసరిగా ప్రయా ణించేవారు. కరోనా తర్వాత మెట్రోలో ప్రయాణించేవారి సంఖ్య నామమాత్రంగానే నమోదవుతూ వస్తుంది. అధికారుల వివిధ రకాల ప్రయత్నాలు.. దానికితోడు ఇపుడిప్పుడే ఐటీ ఉద్యోగులు కార్యాలయాల బాట పడుతుండటంతో మెట్రో ప్రయాణించే రోజువారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. మొన్నటి వరకు 3.50 లక్షలకుపైగా నమోదైన మెట్రో ప్రయాణికుల సంఖ్య.. గణేష్ నిమజ్జం నేపథ్యంలో ప్రజలు హుస్సేన్ సాగర్‌కు రావడంతో మెట్రో స్టేషన్లు జనంతో సందడిగా మారాయి. ట్రైన్లు జనంతో కిక్కిరిసి పోయాయి. శుక్రవారం ఒక్కరోజే 4లక్షల మంది ప్రయాణించినట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో 2.46 లక్షల మంది, నాగోల్- రాయదుర్గం మార్గంలో 1.49 లక్షల మంది, జేబీఎస్-ఎంజీబీఎస్ కారిడార్‌లో 22 వేల మంది, ప్రయాణించారు. అత్యధికంగా ఖైరతాబాద్ మెట్రో స్టేషన్లో 62వేల ఫుట్‌ఫాల్ నమోదు కాగా, ఖైరతాబాద్ స్టేషన్లో 40వేల మంది రైలు దిగగా.. 22 వేల మంది రైలు ఎక్కినట్టు అధికారులు తెలిపారు. దీంతో సరికొత్త రికార్డు నమోదైంది.