Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రులు,ఎమ్మెల్యేల చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేత
- కొత్తగా 77695 మందికి పింఛన్ల మంజూరు
- ఈనెల చివరినాటికి ఖాతాల్లో నగదు జమ
- జిల్లాలో ప్రస్తుతం 1.96లక్షల మందికి లబ్ది
నవతెలంగాణ-సిటీబ్యూరో
జిల్లాలో నేటి నుంచి ఆసరా పథకంగా మంజూరైన కొత్త లబ్ధిదారులకు పింఛన్ కార్డుల పంపిణీని ప్రారం భించనున్నారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులు స్వయంగా నూతన లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్ జిల్లాలో వివిధ కేటగిరీల కింద ఇప్పటికే 1.96 లక్షల మంది ప్రతినెల ఆసరా పింఛన్లు పొందుతుండగా.. వీరికి నెలకు రూ.42.22 కోట్లను ప్రభుత్వం వారి వారి ఖాతాల్లో జమచేస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వస్తే ఆసరా అర్హత వయసు 57 ఏండ్లకు తగ్గించి పింఛను అందిస్తామని 2018 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హమీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల పంద్రాగస్టు కానుకగా ముఖ్యమంత్రి కేసీఆర్ 57ఏండ్లు నిండిన వారికి కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించడంతో మూడేండ్ల ఎదురుచూపు లకు తెరపడినట్టయ్యింది. అంతేగాక జిల్లాలోని 16 మండలాల పరిధిలో దాదాపు కొత్తగా 77,695 మందికి కొత్తగా పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీరికి ఈనెల చివరి వరకు వారి వారి ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి.
ఈ నేపథ్యంలో నేటి నుంచి కొత్త లబ్దిదారులకు ఆసరా పింఛన్ల కార్డులను పంపిణీ చేయనున్నారు. అంతేగాక ఈ పంపిణీ కార్యక్రమం ఈ నెలాఖరు వరకు కొనసాగుతుంది. ఆసరా పింఛన్లతో పాటు ఆసరా కార్డులను కూడా లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. వీరితో పాటు ఇప్పటికే మంజూరైనా 1.96లక్షల మంది లబ్దిదారులకు సైతం కొత్తగా ఆసరా కార్డులను అందజేస్తారు. వీటిని మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా పంపిణీ చేస్తారు.