Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
ఓసీ సామాజిక వర్గాల పేదల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షులు, రైతు ఉద్యమ నేత పోలాడి రామారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం బషీర్‌బాగ్‌లోని సమాఖ్య రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికలో, హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంలో రెడ్డి, వైశ్య వర్గాల పేదల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని, ఇతర డిమాండ్లను నెరవేరుస్తామని స్వయంగా సీఎం కేసిఆర్ ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఇటీవలే రాజధాని శివారులో రాష్ట్రవ్యాప్త భారీ బహిరంగ సభలు నిర్వహించామని, పలుమార్లు మంత్రులను కలిసి వినతి పత్రాలు అందజేశామని గుర్తు చేశారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని ఇతర వర్గాల పేదలతో పాటు ఓసీ సామాజిక వర్గాల పేదల సంక్షేమానికి సమన్యాయం జరగాలన్నదే తమ ఉద్దేశమన్నారు. ఓసీ సామాజిక వర్గాలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 7వ తేదీ నుంచి ఓసీ సంఘాల ఐకాస అధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముట్టడి ఉంటుందన్నారు. 10వ తేదీన రాష్ట్ర రాజధాని ధర్నా చౌక్ వద్ద సమాఖ్య రాష్ట్ర నాయకులతో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నట్లు రామారావు తెలిపారు. సమావేశంలో సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపు జైపాల్ రెడ్డి, రాష్ట్ర ప్రతినిధులు బుస్సా శ్రీనివాస్, చందుపట్ల నర్సింహ్మారెడ్డి, చెన్నమనేని పురుషోత్తమరావు, గంగవరపు రామకష్ణ ప్రసాద్, పెండ్యాల రాంరెడ్డి, జున్నూతుల రాజిరెడ్డి, డాక్టర్ దీపక్ బాబు తదితరులు పాల్గొన్నారు.