Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ పీపుల్స్ ఎజెండా ఫర్ డెవలప్మెంట్
- ఓయూలో రౌండ్ టేబుల్ సమావేశం
నవతెలంగాణ-ఓయూ
విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కేంద్రీకృత నియామక బోర్డును తెలంగాణ పీపుల్స్ ఎజెండా ఫర్ డెవలప్మెంట్ తీవ్రంగా వ్యతిరేకించింది. యూజీసీ నిబంధనలకు విరుద్దంగా చేపట్టిన ఈ నియామాలు కోర్టుల ముందు నిలవబోవని సమావేశానికి హాజరైన పలువురు సీనియర్ అధ్యాపకులు స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న సమస్యలు, అధ్యాపకులు, మౌలిక వసతుల కొరత, పరిశోధనలు తదితర అంశాలపై తెలంగాణ పీపుల్స్ అజెండా ఫర్ డెవలప్మెంట్ (టీప్యాడ్) ఆధ్వర్యంలో ఆదివారం ఓయూ గెస్ట్ హౌస్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సీనియర్ అధ్యాపకులు మాట్లాడుతూ నియామకాలు ఆలస్యం చేసేందుకే బోర్డు ప్రతిపాదన ముందుకు తెచ్చారని ఆరోపించారు. తప్పులు జరిగితే సరిదిద్దాల్సిందిపోయి యూనివర్సిటీల అటానమస్ను దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థ బలంగా ఉంటేనే ఏ దేశమైన సమగ్ర అభివృద్ధి సాధిస్తుందని బీజేపీ జాతీయ నాయకులు, మధ్యప్రదేశ్ ఇన్ఛార్జి మురళీధర్ రావు అన్నారు. విద్య మన దేశంలో ఉమ్మడి జాబితాలో ఉన్నందున రాష్ట్రాల పాత్ర కీలకమైందని అన్నారు. సమావేశానికి హాజరైన ప్రొఫెసర్లు, విద్యారంగ నిష్ణాతులు ప్రతిపాదించిన అంశాలను రాజకీయ పార్టీల ముందు ఎజెండాగా పెట్టాలని అన్నారు. నాణ్యమైన విద్య, పరిశోధన, అధ్యాపకుల కొరత లాంటి అంశాలపై సీనియర్ ప్రొఫెసర్లు తమ అభిప్రాయాలను వెల్లడించారని సమస్యలు, పరిష్కార మార్గాలను సంకలనం చేసి ప్రజల ముందు పెడతామని టీ-ప్యాడ్ చైర్మెన్ మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీ ఛాన్సలర్ ప్రొ. తిరుపతిరావు అన్నారు. అధ్యాపకుల నియామక పద్దతి దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలని మరికొంత మంది ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీ ప్యాడ్ కన్వీనర్ డాక్టర్ శ్రీరాములు, కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎస్.వి సత్యనారాయణ, కో కన్వీనర్ డాక్టర్ కిషన్ రావు, ఔట అధ్యక్షులు ప్రొ.బి. మనోహర్, ఓయూ మాజీ వీసీ ప్రొ. సత్యనారాయణ, పలువురు విశ్రాంత అధ్యాపకులు, విశ్రాంత ఐఏఎస్లు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు పాల్గొని విశ్వ విద్యాలయల్లోని సమస్యలపై చర్చించారు. పలు పరిష్కారాలను సూచించారు. రాతపూర్వకంగా తమ అభిప్రాయాలు పంపాలని ఆ తర్వాత యూనివర్సిటీ విద్యా వ్యవస్థపై ఓ సంకలనం వేసి ప్రజల ఎజెండాగా విడుదల చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.