Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఎర్రం అశోక్
- బాలానగర్ మండల నూతన కమిటీ ఎన్నిక
- కన్వీనర్‌గా ఐలాపురం రాజశేఖర్
నవతెలంగాణ-బాలానగర్
కార్మికుల హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలని సీఐటీయూ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఎర్రం అశోక్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలు అమలు చేయకుండా ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుండడంతో కార్మికులు ఇబ్బందులు అధికమయ్యాయని తెలిపారు. ఆదివారం బాలానగర్ డివిజన్ పరిధిలో సీఐటీయూ మూడవ మహాసభలను నిర్వహిం చారు. మండల కార్యదర్శి ఐలాపురం రాజశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన మహాసభలకు ముఖ్య అతిథిగా ఎర్రం అశోక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశంలోని గుత్తాధిపత్య సంస్థలు, కార్పొరేట్ సంస్థలు కలిసి దేశ ఆర్థిక స్వావలంబనకు ప్రమాదం తెచ్చి పెడుతున్నాయని, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన ప్రభుత్వ సంస్థ రంగాలపై, జాతీయ స్థూల ఉత్పత్తి వద్ధిలో క్రియాశీల భూమిక పోషిస్తున్న కార్మికవర్గంపైన ముప్పేట దాడి చేస్తున్నాయన్నారు. ఆ దోపిడీ శక్తులకు వత్తాసు పలుకుతూ కేంద్రంలోని బీజేపీి 44 లేబర్ చట్టాలను 4 కోడ్లుగా తీసుకొచ్చి కార్మికుల పొట్ట కొడుతున్నారని అన్నారు. కార్పొరేట్లకు మేలుచేసే విధంగా కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం సవరించిందని ఆరోపించారు. కొత్తగా వచ్చిన లేబర్ కోడ్ల వల్ల కార్మిక వర్గం తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టబడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక సంఘా లతో పాటు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ కేంద్రం మొండిగా వీటి అమలుకు పూనుకుంటున్నదని విమర్శించారు. అసంఘటిత కార్మికుల సంఖ్య పెరిగిపోతున్నదని, దేశ శ్రామిక జనాభా దాదాపు 46 కోట్లుంటే, అందులో 42.5 కోట్లు అసంఘటిత కార్మికులే ఉన్నారని, పోరాటాల సాధించుకొన్న కార్మిక చట్టాలు చట్టుబండలుగా మారిపోయాయని ఆరోపించారు. పోషకాహార లోపంతో బాధపడే వారి సంఖ్య అధికమ వుతున్నదని, కోట్లాది మంది మురికివాడల్లో నివసిస్తున్నా, నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతున్నదని, రవాణా, విద్యుత్తు వగైరా ఖరీదైపోయి కార్మిక హక్కులు, మానవ హక్కులపై దాడి జరుగుతున్నదని, ప్రయివేటీకరణ, వేతనాలు, పెన్షన్లలో కోతలు విధించడం, లే ఆఫ్, సంఘం పెట్టుకొనే హక్కునే హరించివేయడం, ఉమ్మడి బేరసారాలాడి కార్మికుల శక్తిని బలహీనపరచడం, న్యాయబద్ధమైన, శాంతియుతమైన వంటి నిరసనలను కూడా సహించలేని వాతావరణం నెలకొన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితులలో కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
అనంతరం సీఐటీయు నూతన కమిటీని ప్రకటించారు. కన్వీనర్‌గా ఐలాపురం రాజశేఖర్, కోకన్వీనర్‌గా లక్ష్మణ్, సుల్తాన్, సుబ్బారావు, ఆనంద్, వనిత, జైథున్, శంకర్, రాములు, నరేందర్ గౌడ్లను మండల కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జగన్, సుగుణ, యాకన్న, భాగ్యలక్ష్మి, సులోచన, లాజర్ పాల్గొన్నారు.