Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీనియర్ సివిల్ జడ్జి రాధిక జైస్వాల్
- ఓయూ లేడీస్ హాస్టల్లో వసతుల పరిశీలన
- విద్యార్థులు, అధికారులతో భేటీ
నవతెలంగాణ-ఓయూ
ఓయూ లేడీస్ హాస్టల్లో నెలకొన్న సమస్యలను వారంలోగా పరిష్కరించాలని నాంపల్లి కోర్టు సీనియర్ సివిల్ జడ్జి, లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రెటరీ జస్టిస్ రాధిక జైస్వాల్ అన్నారు. ఇటీవలే ఓయూ లేడీస్ హాస్టల్ విద్యార్థుల మధ్యాహ్నం భోజనంలో గాజు ముక్కలు వచ్చి విద్యార్థినిలు ధర్నా చేసిన విషయం తెల్సిందే. ఈవిషయం పత్రికల ద్వారా తెలుసుకున్న జస్టిస్ రాధిక జైస్వాల్ మంగళవారం లేడీస్ హాస్టల్‌ను సందర్శించారు. బియ్యం, వివిధ వంట సామగ్రిని, మెస్, రూమ్స్, టాయిలెట్స్ పరిశీలించారు. మజ్జిగ రుచి చూశారు. ఓయూ అధికారులను ఎవరిని తన వెంట లేకుండా కేవలం ఆమె ఒక్కరే వివిధ బ్లాక్స్‌లో కలియతిరిగి విద్యార్థినిలతో మాట్లాడారు.
సమస్యలు, బాధలు చెప్పుకున్న విద్యార్థినిలు
సమస్యలను బయటకు చెప్పిన వారిని టార్గెట్ చేసి కళాశాల ప్రిన్సిపాల్స్ లేదా అధికారుల చెప్పుతూ తమ వాక్ స్వతంత్య్రాన్ని హరిస్తున్నారని, తమ ఇళ్ల వద్ద తల్లిదండ్రులకు చెప్పుతాం అంటూ కొందరు అధికార దుర్వినియోగం చేస్తూ వార్నింగ్‌లు ఇస్తున్నట్లు ఆమె దష్టికి తీసుకు వెళ్లారు. తమకు ఆన్ లిమిటెడ్ భోజనం పెట్టాలని సూచించారు. సాయంత్రం మెనూ మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. అన్ని బ్లాక్స్‌లో ఎక్కువ ఆహార కౌంటర్స్ ఏర్పాటు చేయాలని కోరారు. ఆదివారం సాయంత్రం పులిహోర ఇవ్వడంతో అర్ధాకలితో ఉంటునట్లు చెప్పుకున్నారు. కొంతమంది సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తునట్లు చెప్పారు. వాటర్ లీకేజీలు ఉన్నాయని, విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఆహారం, అల్పాహారం ఇవ్వాలని కోరారు. కొన్ని రూమ్స్‌లో సామర్థ్యానికి మించి విద్యార్థులకు కేటాయించారని, దీనితో బెడ్స్ సరిపోవడం లేదని గోడు వెళ్లబోసుకున్నారు.
అధికారులతో భేటీ
అనంతరం జడ్జి రాధిక జైస్వాల్ లేడీస్ హాస్టల్ డెరైక్టర్ డా.హిమబిందు, ఓయూ లా కళాశాల ప్రిన్సిపాల్ డా.రాధిక యాదవ్, సిబ్బందితో భేటీ అయ్యారు. విద్యార్థులు చెప్పిన సమస్యలు వారి దష్టికి తీసుకువచ్చారు. కొంతమంది సిబ్బంది తీరు మార్చుకోవాలని, వెంటనే కొన్ని మరమ్మతులు చేపట్టాలని, ఫుడ్ కౌంటర్లు పెంచాలని, ఆదివారం సాయంత్రం ఆహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రూమ్ సామర్థ్యం బట్టి విద్యార్థులను కేటాయించాలని, తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. సమస్యలు పరిష్కరించాలని మళ్లీ వారం రోజుల్లో ఇక్కడకు వస్తాను అని, అప్పటి వరకు ఇలాగే ఉంటే రిపోర్ట్‌ను పై అధికారులకు అందజేస్తామన్నారు. ఆమె వెంట పారా లీగల్ వాలంటీర్స్ పత్తి నరేష్, ఎస్.రాము, రాకేష్ ఉన్నారు.