Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. నాగేశ్వర రావు
- ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఎదుట నిరసన
నవతెలంగాణ-ఓయూ
యూనివర్సిటీల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పతనం కోసమేనని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. నాగేశ్వరరావు అన్నారు. ప్రయివేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు అనుమతించడం అంటే ప్రభుత్వ విద్యను నీరుగార్చడమే అని మండిపడ్డారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) ఓయూ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్.నాగేశ్వర రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాల అటానమస్ను దెబ్బతీసి తమ పార్టీ అనుబంధ కార్యాలయాలుగా విశ్వవిద్యాలయాలను మార్చాలనే కుట్రను రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదన్నారు. దానిలో భాగంగానే యూనివర్సిటీల కామన్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎంసెట్ మొదలుకొని వివిధ ఉద్యోగాల భర్తీ వరకు నిర్వహించిన అన్ని రకాల పరీక్షలు బోర్డుల పరిధిలోనే నిర్వహించినవేననీ, ఆయా సందర్భాల్లో అవి అవినీతికి చిరునామాగా మారిన వాస్తవాన్ని విస్మరించి విద్యా శాఖ మంత్రి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీల అభివద్ధికి నిధులు, విద్యార్థులకు ఫెలోషిప్ వంటి పథకాలు కేటాయించకుండా విద్యారంగ అబివద్ధికి కోసమే ప్రయివేట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నామని ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ మొదలుకొని ఓయూ వరకు సమస్యలకు నిలయాలుగా మారుతున్న కేసీఆర్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఎద్దేవా చేశారు. యూనివర్సిటీల రిక్రూట్మెంట్ బోర్డ్ చట్టం ఉపసంరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాబోయే రోజుల్లో విద్యార్థి ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పీడీఎస్యూ ఓయూ అధ్యక్షులు ఎన్.సుమంత్, ప్రధాన కార్యదర్శి కె.స్వాతి, రుక్మత్ పాషా, శ్వేత, నవనీత, శైలజ, సవిత, చిరంజీవి, క్రాంతి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.