Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్/ఓయూ
నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలంటూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానించడం హర్షనీయమని ప్రజాసంఘాల జేఏసీ చైర్మెన్ గజ్జల కాంతం అన్నారు. మంగళవారం సోమాజిగూడా ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకమని కొనియడారు. మోడీ సైతం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తాను ప్రధానిని అయ్యానంటూ పలుమార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అంబేద్కర్ పేరు పెట్టేందుకు ఉన్న అడ్డంకులు ఏంటని నిలదీశారు. తెలంగాణ ప్రాంతం భారతీయ యూనియన్లలో విలీనమైన రోజును విమోచనమా? విలీనమా? అంటూ జరుగుతున్న స్తబ్దతపై ఈనెల 15న రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 17న రాజకీయ పార్టీలు తమ రాజకీయాల కోసం వాడుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగే ఈ సమావేశానికి పలువురు రాజకీయ నేతలు మేధావులను ఆహ్వానిస్తామని చెప్పారు.
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
నూతన పార్లమెంట్ భవనానికి డా.బి.ఆర్. అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయం అని టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గదరాజు చందు అన్నారు. మంగళవారం ఆర్ట్స్ కళాశాల ఎదుట సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా చందు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు నూతన పార్లమెంట్ భవనానికి పెట్టాలని నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కి దళిత సంఘాలు, విద్యార్థుల పక్షాన కతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ నేతలు జంగం అవినాష్, దశరథ్, బొల్లు నాగరాజు యాదవ్, జలేందర్, ప్రవీణ్, శేషు,రాజు, రామ కష్ణ, శ్రీను, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.