Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ సైకాలజిస్ట్ డా.వీరేందర్
నవతెలంగాణ-ధూల్‌పేట్
మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, నిర్లక్ష్యం చేస్తే మొదటికే ప్రమాదమని ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్.వీరేందర్ అన్నారు. మంగళవారం ప్రభుత్వ సిటీ కళాశాల ఐక్యూఏసీ విభాగం ఆధ్వర్యంలో 'మానసిక ఆరోగ్యం-అపోహలు, వాస్తవాలు' అంశంపై ఎగ్జిబిషన్, వర్క్‌షాప్ జరిగింది. ముందుగా ఏవీ కాలేజీ సైకాలజీ విద్యార్థులు నిర్వహించిన ఎగ్జిబిషన్‌ను డాక్టర్.వీరేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరీరానికి గాయం తగిలితే, జబ్బు చేస్తే సంబంధిత వైద్యుల సలహాలతో ఎలా చికిత్స తీసుకుంటామో, అదేవిధంగా మానసిక ఒత్తిడి, కుంగుబాటు, ఇతర మానసిక అనారోగ్యాలు కలిగినప్పుడు మానసిక వైద్యులు, సైకాలజిస్టుల వద్ద చికిత్స తీసుకోవాలని అన్నారు. లేకపోతే అది శరీరంపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుందని అన్నారు. ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య వంటి విపరీత నిర్ణయాలు తీసుకోవటం సరికాదని అన్నారు. మాదక ద్రవ్యాలతో పాటు సెల్‌ఫోన్, సోషల్ మీడియా సరికొత్త వ్యసనాలుగా మారాయని, గుర్తింపు కోసం వీటిపై ఆధారపడుతున్న చాలా మంది విద్యార్థులు, యువత తమ సమయాన్ని వధా చేసుకుంటూ లక్ష్యం లేకుండా గడుపుతున్నారని అన్నారు. కొద్దిమంది యువత పట్టుదలతో తమ గమ్యాన్ని చేరుకుంటున్నారని గుర్తుచేశారు. ప్రతి వ్యక్తి తమకు తామే సాటి అని గుర్తించి, తమ జీవితాన్ని అర్థవంతంగా మార్చుకోవటమే కాక తమ తోటివారికి కూడా సహాయ కారులుగా ఉండాలని సూచించారు. ఇతరులతో పోల్చుకోవడం మానుకోవాలని, తోటివారి గెలుపు మనకు స్ఫూర్తినివ్వాలి తప్ప మనలో వారి పట్ల శతభావాన్ని పెంచకూడదని అన్నారు. సభాధ్యక్షులు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్.పి.బాల భాస్కర్ మాట్లాడుతూ శారీరక దఢత్వం కంటే మానసిక స్థిరచిత్తమే ముఖ్యమని, విద్యార్థులు ఎటువంటి ఒత్తిడులకు లోను కాకుండా అధ్యాపకుల సహకారంతో జీవితంలో ఉత్తమంగా ఎదగాలని అన్నారు. సమాజానికి ఆరోగ్యకరమైన తరాన్ని అందించటం విద్యాసంస్థల బాధ్యత అని, అలాంటి బాధ్యతల నిర్వహణలో సిటీ కళాశాల ముందుంటుందని అన్నారు. అందుకోసం డాక్టర్.వీరేందర్తో దీర్ఘకాల ఒప్పందంతో పనిచేస్తామని అన్నారు.
అపోహలు తొలగించటమే లక్ష్యం: డాక్టర్ నీరజ
మానసిక అనారోగ్యం పట్ల భారతీయులు చాలా ఉదాసీనంగా ఉంటారని డబ్ల్యూహెచ్ఓ నివేదికలు చెపుతున్నాయని కార్యక్రమ కన్వీనర్ డాక్టర్.జె.నీరజ తెలిపారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారి పట్ల భారతీయుల వైఖరి కూడా నిర్ణయాత్మకంగా ఉంటుందని అన్నారు. ఈ కారణంగానే సాధారణ ప్రజలలో మానసిక అనారోగ్యంపట్ల అవగాహన లోపిస్తున్నదని, ఇవి అపోహలకు దారితీసి విపరీత పరిణామాలకు కారణమవుతున్నాయన్నారు. విద్యార్థులలో అపోహలు తొలగించి వాస్తవాలను తెలియజెప్పాలనే ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు.
ఆకట్టుకున్న ఎగ్జిబిషన్
ఈ సందర్భంగా ఏవీ కాలేజీ సైకాలజీ విద్యార్థులు నిర్వహించిన ఎగ్జిబిషన్ పలువురిని ఎంతో ఆకట్టుకుంది. వివిధ మానసిక రుగ్మతలకు కారణాలు, లక్షణాలు, గుర్తించే విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులు వివరించిన తీరు అందరినీ ఆకర్షితులను చేసింది. క్లస్టర్ కాలేజీలైన సెయింట్ ఆన్స్, సెయింట్ జోసెఫ్స్, సెయింట్ ఫ్రాన్సిస్, ఏవీ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం ఆద్యంతం విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని తమ ప్రశ్నలకు సైకాలజిస్ట్ డాక్టర్.వీరేందర్‌ను సమాధానాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సుమనా యాదగిరి, డాక్టర్.కోయి కోటేశ్వర రావు, డాక్టర్.రత్న ప్రభాకర్ పాల్గొన్నారు.