Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
నవతెలంగాణ-అంబర్‌పేట
పారిశుధ్య నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సంబంధిత అధికారులను హెచ్చరించారు. పలు ప్రాంతాల్లో చెత్త వ్యర్థాలు పేరుకుపోయి అస్తవ్యస్తంగా మారాయన్న స్థానికుల ఫిర్యాదుతో మంగళవారం గోల్నాక డివిజన్లో ఆకస్మికంగా పర్యటించారు. గోల్నాక చౌరస్తా నుంచి అలీకేఫ్ చౌరస్తా వరకు డీఎంసీ వేణుగోపాల్, ఏఎంహెచ్‌వో జ్యోతితో కలిసి పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు. పేరుకుపోయిన చెత్త వ్యర్థాలను చూసి అసంతప్తి వ్యక్తం చేశారు. పారిశుధ్య సిబ్బందితో పాటు సూపర్వైజర్లు అందరూ సక్రమంగా విధులకు హాజరవుతున్నదీ లేనిది అడిగి తెలుసుకున్నారు. ప్రధాన రహదారులతో పాటు కాలనీలు, బస్తీల్లో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. రహదారులపై పేరుకు పోయిన వ్యర్థాలను యుద్ధప్రాతిపదికన శుభ్రం చేయించాలన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు వ్యాధులు ప్రబలే అవకాశముందని హెచ్చరించారు. పారిశుధ్య నిర్వహణలో అలసత్వం వహిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని సూపర్వైజర్లను హెచ్చరించారు. అలాగే చెత్తను రహదారులపై వేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. పారిశుధ్య సిబ్బంది పనితీరును ఎప్పటికప్పడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.