Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మల్లాపూర్లో కాంట్రాక్టర్లకు బిల్లులు అందక ఆగిపోయిన ఇండ్ల నిర్మాణ పనులు
నవతెలంగాణ-బడంగ్పేట్
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇండ్లులేని నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మాణం చేసి ఇస్తామన్న సీఎం కేసీఆర్ మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేద ప్రజలకు నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మాణం చేసి, పేద ప్రజలకు ఇవ్వాలనే లక్ష్యం నెరవేర్చటంలో పూర్తిగా విఫలమైనట్లు ప్రజల నుండి ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధనవంతులకు కొమ్ముకాస్తూ పాలన సాగిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పాలన సాగుతోందని చెప్పటం తప్ప ఆచరణలో కనిపించటంలేదు.
మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని మల్లాపూర్ ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 73లో గత నాలుగు సంవత్సరాల క్రితం మహేశ్వరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తీగల కష్ణారెడ్డి ఎంతో ఆర్భాటంగా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. పనులు ప్రారంభించి 4సంవత్స రాలు గడుస్తున్పటికీ అర్థాంతరంగా నిలిచిపోయాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోవటంతోనే పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయని తెలిసింది. ఇప్పటికైన ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసి, ఇండ్ల నిర్మాణ పనులను పూర్తిచేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
సీఎం కేసీఆర్ మాటలన్నీ నీటిమూటలే
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం లోకి వచ్చాక అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే హామీలను తుంగ లో తొక్కి ప్రజా సమస్యలను పట్టించు కోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రజా సమస్యలను విస్మరించిన ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు.
- చెరుకుపల్లి వెంకట్ రెడ్డి
బడంగ్పేట్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు
డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీలోవిఫలం
ఇండ్లులేని నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేయటంలో ప్రభుత్వం పూర్తిగా విఫల మైంది. తెలంగాణ ప్రభుత్వం అధికారం లోకి వస్తే పేదల తలరాత మారుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు దాటినా, నేటికీి డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేయలేదు. మహేశ్వరం నియోజకవర్గంలో ఎక్కడా డబుల్ బెడ్రూం ఇచ్చిన దాఖలాలు లేవు.
- వరికుప్పల వెంకటేష్ ముదిరాజ్
మున్సిపల కార్పొరేషన్ ఉపాధ్యక్షులు