Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని 'చిట్టెలుక పోరాటం' అంటూ అవమానం
- ప్రకాశ్‌రెడ్డి వ్యాఖ్యలపై భగ్గుమన్న ప్రజా సంఘాలు
- దిష్టిబొమ్మ దహనం, క్షమాపణ చెప్పాలని డిమాండ్
నవతెలంగాణ- సిటీబ్యూరో
నిజాం నిరంకుశ పాలనకు, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని అవమానించేలా బీజేపీ నేత ప్రకాశ్‌రెడ్డి అహంకారపూరిత వ్యాఖ్యలు చేయడంపట్ల ప్రజా సంఘాలు మండిపడ్డాయి. వీరోచితంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ''చిట్టెలుక పోరాటం.. అది కేవలం ఒక చిన్న గ్రామ పోరాటం.. కేవలం విసునూరు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా జరిగిన పోరాటమే తప్ప నిజాంకు వ్యతిరేకంగా జరిగింది కాదు..'' అన్న బీజేపీ నేత ప్రకాశ్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. గురువారం సుందరయ్య పార్కువద్ద ప్రకాశ్ రెడ్డి దిష్టి బొమ్మను ప్రజా సంఘాల నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఓ టీవీ డిబెట్లో పాల్గొన్న బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి.. ''తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని వక్రీకరించడమే కాకుండా.. అది నైజాంకు వ్యతిరేకంగా జరగలేదు'' అనడం శోచనీయమన్నారు. ఆ పోరాటంలో వీరమరణం పొందిన దొడ్డి కొమురయ్య, వీరనారి ఐలమ్మ, ఠానూ నాయక్ వంటి యోధులను అవమానపరిచారని, అందుకు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విసునూరు దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని.. తెలంగాణ సాయుధ పోరాటమని ఎలా చెబుతారని ప్రకాశ్‌రెడ్డి మాట్లాడటమే కాకుండా.. రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటమే అసలైన నిజాం వ్యతిరేక పోరాటమని చరిత్రను పూర్తిగా వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ వ్యాపితంగా భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం, దొరలు, రజాకారుల ఆగడాలను ఎదిరించి పోరాడిన వేలాదిమంది అమరుల త్యాగాలను అవమానపరుస్తూ, అవహేళన చేస్తూ బీజేపీ పైశాచికానందం పొందుతున్నదని విమర్శించారు.
బీజేపీ నాయకత్వానికి తెలంగాణ ప్రజలమీద, ఇక్కడి పోరాటాల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా తక్షణమే స్పందించి ప్రకాశ్‌రెడ్డిని వారి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. లేకపోతే ఈనెల 17న జరిగే బీజేపీ బహిరంగ సభను అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి.నరేష్, పి.ఆశయ్య, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.ధర్మానాయక్, ఆర్.శ్రీరాంనాయక్, ఐద్వా సీనియర్ నాయకులు బత్తుల హైమావతి, రాష్ట్ర అధ్యక్షులు అరుణజ్యోతి, రజకసమితి రాష్ట్ర కార్యదర్శి సకినాల రవి, గుమ్మడి రాజు వెంకన్న, పి.రవి, పి.సాయి, పి.అమ్మరాదాసు పాల్గొన్నారు.