Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
- కేర్ ఆస్పత్రిలో రోబోటిక్ సర్జరీ కేంద్రం ప్రారంభం
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఆస్పత్రుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి. హరీశ్‌రావు అన్నారు. బంజారహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో రోబోటిక్ సర్జరీ కేంద్రాన్ని గురువారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్త టెక్నాలజీ ద్వారా శస్త్ర చికిత్స మరింత సులువుగా మారుతుందన్నారు. రోబోటిక్ సర్జరీ ద్వారా పేషెంట్లు త్వరగా కోలుకుంటున్నారని, బెస్ట్ ట్రీట్మెంట్తోపాటు ఎకానమిక్ ట్రీట్మెంట్ కూడా అవసరం అని అన్నారు. హైదరాబాద్ మెడికల్ టూరిజం హబ్‌గా మారుతోందన్నారు. ఎటువంటి సమస్యలు లేని నగరం ఏదైనా ఉందంటే అది హైదరాబాద్ మాత్రమేనని చెప్పారు. అవయవ మార్పడి చికత్సలకు ఆరోగ్య శ్రీ ద్వారా తెలంగాణ ప్రభుత్వం పది లక్షలు ఇస్తోందన్నారు. ఐటీ హబ్‌గా ఉన్న హైదరాబాద్ త్వరలోనే మెడికల్ హబ్‌గా మారనుందని తెలిపారు. 33 జిల్లాలలో మెడికల్ కాలేజీలు వస్తున్నాయని, ఇప్పటికే 17 కాలేజీలు ఏర్పాటు అయ్యాయని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అడ్మినిస్ట్రేషన్, శానిటేషన్, ఇతర సౌకర్యాలు చాలా మెరుగు పరిచామని చెప్పారు. 'సి' సెక్షన్ తగ్గాలని గవర్నమెంట్ ఆస్పత్రుల్లో నార్మల్ డెలివరీ చేస్తే మూడు వేలు రూపాయలు డాక్లర్లకు ఇస్తున్నామని చెప్పారు. ప్రయివేట్ ఆస్పత్రిలో సి సెక్షన్స్ 70 నుంచి 75 శాతం ఉందని, ప్రయివేటులో సి సెక్షన్స్ తగ్గించాలని కోరారు. కేర్ హాస్పిటల్స్ గైనకాలజీ విభాగం హెడ్ డాక్టర్ మంజుల అనగాని మాట్లాడుతూ... ప్రపంచంలోని అత్యంత అధునాతన మెడ్‌ట్రానిక్ హ్యూగో రోబోటిక్-అసిస్టెడ్ సర్జరీ సిస్టమ్‌ని ఉపయోగిస్తూ అడెనోమయోసిస్తో దీర్ఘకాలికంగా బాధపడుతున్న 46 ఏండ్ల మహిళకు గర్భాశయం తొలగించే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, ఆస్పత్రి గ్రూప్ చీఫ్ అఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ నిఖిల్ మాథుర్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టి.వి.ఎస్. గోపాల్, యూరాలజీ విభాగ అధిపతి డాక్టర్ పి.వంశీ కృష్ణ, ఆస్పత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ నీలేష్ గుప్తా, పద్మశ్రీ డాక్టర్ మంజుల అలగాని, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.