Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్ కార్మికులతో కలిసి సీఐటీయూ నాయకుల నిరసన
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు కాంట్రాక్ట్ అర్బన్ ఫారెస్ట్ కార్మికులకు జీవో 60 ప్రకారం వెంటనే జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ గురువారం అమీర్‌పేటలోని హెచ్ఎండీఏ కార్యాలయం వద్ద సుమారు వందమంది కార్మికులతో కలిసి సీఐటీయూ నాయకులు భారీ నిరసన తెలిపారు. యూనియన్ గౌరవ అధ్యక్షులు జె. కుమారస్వామి, అధ్యక్షులు ఆర్.వాణి మాట్లాడుతూ బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు (హెచ్ఎండీఏ) పరిధిలో ఉన్న పార్కుల్లో సుమారు 385 మంది 'మాలి' వర్కర్లుగా పనిచేస్తున్నారని చెప్పారు. ప్రతిరోజు పార్కులను శుభ్రం చేస్తూ సుందరవనాలుగా తీర్చిదిద్దుతున్న కార్మికులకు జీవో 60 ప్రకారం వేతనాలు పెంచట్లేదన్నారు. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలోని కాంట్రాక్టు సెక్యూరిటీ గార్డులు, హౌస్ కీపింగ్ వర్కర్స్, ఔట్సోర్సింగ్ వర్కర్లకు ఇప్పటికే జీవో 60 ప్రకారం వేతనాలు పెంచారని, అలాగే జూన్ 2021 నుంచి ఇవ్వాల్సిన అరియర్స్ కూడా చెల్లించారని గుర్తుచేశారు. అయితే అర్బన్ ఫారెస్ట్ మాలి కార్మికులకు ఎన్నో ఏండ్లుగా రూ.9,990 మాత్రమే జీతం ఇస్తున్నారని, జీవో 60 ప్రకారం రూ. 15,600 పెంచిన జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం హెచ్ఎండీఏ కమిషనర్ ఆఫీసులో అందుబాటులో లేనందున, ఆయన సెక్రటరీ చంద్రయ్యకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఎస్సార్‌నగర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో సుమారు 30 మంది మహిళా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యదర్శి . ఉమా, కోశాధికారి సుధాకర్, కమిటీ సభ్యులు నాగమణి, ప్రేమలత, ప్రమీల, వెంకటలక్ష్మి, అనురాధ, భాగ్య, హరికష్ణ పాల్గొన్నారు.