Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ మస్య్కూలర్ డిస్ట్రోఫి అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్ రెడ్డి
- ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద వికలాంగుల ర్యాలీ
నవతెలంగాణ-అడిక్‌మెట్
తీవ్రమైన వైకల్యం కలిగిన వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని తెలంగాణ మస్య్కూలర్ డిస్ట్రోపి అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ మస్య్కూలర్ డిస్ట్రోఫి ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కండర క్షీణత బాధితుల అవగాహన సదస్సు, వీల్‌చైర్స్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తెలంగాణ మస్య్కూలర్ డిస్ట్రోఫి అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్ రెడ్డి హాజరై మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 3,500 మంది కండర క్షీణత వ్యాధితో బాధపడుతున్నారని చెప్పారు. ఇద్దరి సహాయం లేనిదే తాము సొంత పనులు చేసుకోలేకపోతున్నామని, వయసు మళ్లిన తల్లిదండ్రులు తమకు సేవ చేయలేకపోతున్నారని వాపోయారు. ఈ వయసులో కన్నవాళ్లకు తాము సేవ చేసేది పోయి.. కన్నపాపానికి వారు తమకు సేవలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వికలాంగుల హక్కుల చట్టం 2016 అమలు చేస్తూ సెక్షన్ 38 ప్రకారం తీవ్రమైన వైకల్యం కలిగిన తమకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలన్నారు. పది వేల రూపాయల కేర్ టేకర్ అలవెన్స్ మంజూరు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల మానవతా దక్పథంతో తమకు ఎలక్ట్రిక్ వీల్చైర్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఎన్నో మంచి పథకాలు ప్రవేశపెడుతూ సకల జనుల అభివద్ధికి లబ్ది చేకూరుస్తున్నారని, అదేవిధంగా వికలాంగులకు ఇస్తున్న పెన్షన్ పెంచాలని విజ్ఞప్తి చేశారు. వీల్చైర్లకే పరిమితం కావడంతో షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయని, ప్రత్యేక హెల్త్ కార్డులు జారీ చేయాలని కోరారు. అంగన్వాడీసెంటర్ల ద్వారా బలవర్ధకమైన ఆహారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
మస్య్కూలర్ డిస్ట్రోఫీ అంటే ఒక జన్యు డిజాస్టర్ అని, ఇది అతిభయంకరమైన జబ్బుగా నిర్ధారణ అయిందన్నారు. బాల్యంలోనే వచ్చే ప్రమాదకరమైన వ్యాధి దేహంలో కండరాలు రోజురోజుకు క్షీణించి ఏ అవయవం కూడా పనిచేయకుండా చేస్తుందన్నారు. క్రమేపీ లివర్, కిడ్నీ, గుండె పని చేయక మరణం సంభవిస్తుందని అన్నారు. సీసీఎంబీకి తగిన బడ్జెట్ కేటాయించి తొందరగా మెడిసిన్ కనుక్కొని మస్య్కూలర్ డిస్ట్రోఫీ బాధితుల జీవితాల్లో వెలుగు నింపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ పత్తల బాలకష్ణ, ప్రధాన కార్యదర్శి రవికుమార్, కోశాధికారి వినోద్, శివకుమార్, సతీష్ చంద్ర, రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.