Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
పచ్చని వాతావరణంతో ఓయూ పరిసరాలు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ప్రాణవాయువును అందిస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) సహకారంతో ఓయూలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ పార్కును వీసీ డి.రవీందర్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణతో కలిసి ఆక్సిజన్ పార్కులో కలియ తిరిగారు. మెయిన్ చెరువు అభివృద్ధి, ఇతర మౌలిక వసతుల కల్పనపై ప్రొ. రవీందర్ సంతోష్‌కు వివరించారు. సమగ్ర నివేదిక (డీపీఆర్)తో వస్తే ఆక్సిజన్ పార్క్ సహా ఉస్మానియా ఆవరణలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తానని ఈ సందర్భంగా వీసీకి ఎంపీ హామీ ఇచ్చారు. అనంతరం ప్రొఫసర్ రవీందర్ మాట్లాడుతూ 200 రకాల ఔషధ మొక్కలు, చెట్లతో ఆక్సిజన్ పార్కును అభివృద్ధి చేశామని తెలిపారు. వెయ్యికి పైగా నెమళ్లు ఇక్కడ ఉన్నాయని, వాటి సంరక్షణతో పాటు బయో డైవర్సిటీకి ఓయూ కేంద్రంగా ఉందని స్పష్టం చేశారు. హెచ్ఎండీఏ కమిషనర్‌గా, ఓయూ ఇన్ఛార్జ్ వీసీగా ఉన్న అరవింద్ కుమార్ కృషి వల్ల ఓయూలో పెద్దఎత్తున మొక్కలు నాటారని, ప్రస్తుతం ఓ అడవిని సృష్టించామని అన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ చేతుల మీదుగా పార్క్‌ను విద్యార్థులు, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం సంతోషంగా ఉందని చెప్పారు. జీవజాతుల సంరక్షణ, పరిసరాల పరిశుభ్రత దృష్ట్యా పాదచారులను కొంత వరకు కట్టడి చేశామని.. ఉదయం, సాయంత్రం మాత్రమే కొంతమేరకు అనుమతిస్తున్నాని వెల్లడించారు. ముఖ్యమంత్రి సహకారం వల్ల పచ్చని చెట్లతో ఉస్మానియా ప్రాంగణం ఆహ్లాదకరంగా మారిందని స్పష్టం చేశారు. ఓజోన్ డే సందర్భంగా ఓజోన్ పార్క్ ముందు ఎంపీ సంతోష్, వీసీ రవీందర్, రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ, మొక్కలు నాటారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ బి రెడ్యా నాయక్, ఓఎస్డీ, డీన్లు, ప్రిన్సిపాల్స్, డైరెక్టర్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, స్కాలర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.