Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
- ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం
నవతెలంగాణ-అంబర్‌పేట/ఓయూ
భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తున్న అనేక పథకాలు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ గిరిజనుల అభివృద్ధికి మరో విప్లవాత్మక పథకానికి శ్రీకారం చుట్టారని, కేసీఆర్ గిరిజన బాంధవుడని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కొనియాడారు. రైతుబంధు, దళితబంధు తరహాలోనే ఆదివాసీల అభ్యున్నతికి గిరిజనబంధు అమలు చేస్తామని సీఎం ప్రకటించడంతో మొత్తం గిరిజన సమాజం సంతోషంలో మునిగితేలుతుందని చెప్పారు. గిరిజనులకు పది శాతం రిజర్వేషన్, భూమిలేని నిరుపేద గిరిజనులకు గిరిజన బంధు పథకం అమలు చేస్తామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో అంబర్‌పేట నియోజకవర్గం గిరిజన సంఘం నాయకుడు రమేష్ నాయక్ ఆధ్వర్యంలో ఆదివారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటికే గిరిజనులకు అనేక పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్ మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. పదిశాతం రిజర్వేషన్ గిరిజనుల పాలిట గొప్పవరమని చెప్పారు. సీఎం కేసీఆర్ గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని, గిరిజన సంక్షేమం ఆయనతోనే సాధ్యమని తెలిపారు. హైదరాబాద్‌లో ఆదివాసీ, బంజార భవనాలు ప్రారంభించారని, ఇన్నేండ్లలో ఏ ఒక్క నాయకుడు ఇలాంటి ఆలోచన చేయలేదన్నారు. కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు రఘునాయక్, వినోద్ కుమార్, భగల నాయక్, బి.రమేష్ నాయక్, రజితభాయి, యాదిభాయి, శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ 10 శాతం రిజర్వేషన్ హామీని నెరవేర్చి గిరిజన బాంధవుడు అయ్యారని ఆల్ ఇండియా బంజారా స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కరాటే రాజు నాయక్, కార్యదర్శి బాదావత్ లక్ష్మణ్ నాయక్ అన్నారు. ఎస్టీ రిజర్వేషన్ల పెంపుతో గిరిజన కుటుంబాల్లో వెలుగులు నింపారని, ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. రేపటినుంచి వారం రోజుల వరకు ప్రతి తండా, గూడాలల్లో కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిóషేకాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
గిరిజనుల రిజర్వేషన్లు 10% పెంచుతూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని లంబాడీ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు దాస్ రాం నాయక్ అన్నారు. ఆదివారం ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీఓ విడుదల చేసేంతవరకు గిరిజన మేధావులు, ప్రజలు, అన్ని సంఘాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం సహకరించాలని లేదంటే ప్రజాక్షేత్రంలో బీజేపీపై యుద్ధం తప్పదని హెచ్చరించారు. సమావేశంలో ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందర్ నాయక్, ఎల్ఎస్ఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ శివాజీ నాయక్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్, స్టేట్ ఈసీ మెంబర్ గాసిరామ్ రాథోడ్ విభాగం నాయకులు సంగ్రామ్, ఓయూ నాయకులు శంకర్, రాజు, రమేష్, జె.రాజు, సుభాష్, భూక్య రమేష్, రాంబాబు, అజ్మీరా రమేష్ పాల్గొన్నారు.
గిరిజన రిజర్వేషన్స్ 6% నుంచి10% వరకు పెంచడం హర్షణీయం అని ఓయూ ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ మంగు నాయక్ అన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం యావత్తు గిరిజనుల్లో ముందే దసరా పండుగ తెచ్చిందన్నారు. రిజర్వేషన్స్ పెంపు ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి ఊరట ఇస్తుందన్నారు.