Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అది కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల మెడపై వేలాడే కత్తి !
- అగ్రిమెంట్ బాండ్ నిర్ణయాన్ని ఓయూ వీసీ, ఉన్నతాధికారులు వెనక్కి తీసుకోవాలి
- ఓయూ కాంట్రాక్టు ప్రొఫెసర్ల డిమాండ్
- ఈసీ నిర్ణయం తీసుకుంది : ఓయూ రిజిస్ట్రార్
- ఆందోళన దిశగా అసిస్టెంట్ కాంట్రాక్టు ప్రొఫెసర్స్
నవతెలంగాణ-ఓయూ
ఓయూ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు బాండ్ అగ్రిమెంట్ విధానాన్ని అమలు చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు కోరుతున్నారు. దానివల్ల తమ ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని, అన్ని విధాలా నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓయూ ఉన్నతాధికారులు స్పందించకుంటే తాము ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. కాగా ఈ విషయం లో ఈసీ నిర్ణయం తీసుకుందని రిజిస్ట్రార్ అంటున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో కొన్నేండ్ల నుంచి పనిచేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల కొనసాగింపులో 'బాండ్ అగ్రిమెంట్ విధానం' అమలు చేయనున్నట్టు సెప్టెంబర్ 7న ఓయూ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. ఇందులో భాగంగా ఈనెల 24లోపు వివిధ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమ తమ కళాశాలల్లో సంతకంతో కూడిన బాండ్ అగ్రిమెంట్స్ ప్రిన్సిపాల్స్‌కు సమర్పించాలని ఆదేశాలు జారీచేశారు. అయితే ఈ సర్క్యులర్ విషయంలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు సుముఖంగా లేరు. పైగా ఆందోళన బాటపడుతున్నారు. బాండ్ అగ్రిమెంట్ జీవోను ఓయూ అధికారులు వెనక్కి తీసుకోవాలని, లేకపోతే వివిధ రూపాల్లో తమ ఆందోళన కొనసాగిస్తామని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు చెప్తున్నారు. ఈమేరకు శనివారం ఓయూలో ర్యాలీ, ధర్నా కూడా నిర్వహించారు. గత సంవత్సరం సెప్టెంబర్‌లో కూడా ఈ అగ్రిమెంట్ విధానాన్ని తీసుకువస్తే కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయిన నేపథ్యంలో నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు వీసీ స్వయంగా హామీ ఇచ్చారని, నేడు ఎందుకు మళ్లీ అదే అంశాన్ని ముందుకు తెచ్చి హామీ విస్మరిస్తున్నారని కాంట్రాక్టు ప్రొఫెసర్లు ప్రశ్నిస్తున్నారు. వీసీ ఏకపక్ష నిర్ణయం సరైంది కాదని అభిప్రాయ పడుతున్నారు. బాండ్ అగ్రిమెంట్ విధానం కాంట్రాక్టు అధ్యాప కుల ఉనికిని, హక్కులను కాలరాసే విధంగా ఉందన్నారు.
కాంట్రాక్టు ప్రొఫెసర్లకు రెన్యువల్స్, సెలువులు, వేతనాల పెంపు వంటి సౌకర్యాలేవీ బాండ్ అగ్రిమెంట్ విధానంలో లేవని, ఇది పూర్తిగా అధ్యాపకుల హక్కులను కాలరాసేదిగా ఉందని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పైగా ఇందులో విభాగం హెడ్స్‌కు లేదా ప్రిన్సిపాల్స్‌కు వారికి నచ్చక పోతే తొలగించే అధికారం వర్తింపజేసేలా పొందుపరిచారని తెలిపారు. రానున్న రెగ్యులర్ రిక్రూమెంట్లో వెయిటేజీ ఉండదని, తమ సర్వీసుకు గుర్తింపులేకుండా బాండ్ ఉందని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు చెప్తున్నారు. తాము జాయింగ్ సందర్భంగా ఇంటర్వ్యూ నిర్వహించి, షరతులతో కూడిన అపాయింట్మెంట్ ఆర్డర్స్‌ను ఓయూ అధికారులు ఇచ్చామని గుర్తు చేశారు. కాంట్రాక్టు ఉద్యోగమే అయినా సాఫీగా సాగుతుం దనుకుంటే బాండ్ అగ్రిమెంట్‌తో తమకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారని వాపోతున్నారు. ఉద్యోగుల అభిప్రా యాలను, వారి సర్వీసును, రిక్రూట్మెంట్ ప్రాసెస్‌ను పట్టించు కోకుండా ఓయూ అధికారులు అమలు చేయాలనుకుంటున్న బాండ్ అగ్రిమెంట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని బాండ్‌ను రద్దు చేయించాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు డిమాండ్ చేస్తున్నారు.
అగ్రిమెంట్ పేరుతో చెలగాటం
ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తానంది. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో కూడా ఇదే హామీ ఇచ్చారు. అసెంబ్లీలో కూడా పలు దఫాలు రెగ్యులరైజేషన్‌పై చర్చించారు. రెగ్యులరైజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న క్రమంలో వీసీ బాండ్ అగ్రిమెంట్ పేరుతో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల మెడమీద కత్తిలా మళ్లీ బాండ్ అగ్రిమెంట్ ముందుకు తెచ్చారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. అది కూడా ఇవ్వట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్లు 11, 16, 141 ప్రకారం మాకు వేతనాలు పెంచాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. అగ్రిమెంట్ బాండ్ పేరుతో మా జీవితాలతో చెలగాటం ఆడవద్దని కోరుతున్నాం.
- డా. ఎ.పరశురాం,
కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
వీసీ మాట తప్పడం బాధాకరం
ఓయూ వీసీ ఈనెల 24లోపు అగ్రిమెంట్ బాండ్ మీద సంతకం చేసి సబ్మిట్ చేయాలి. లేదంటే తర్వాత రోజు నుంచి ఉద్యోగంలో లేనట్టేనని ప్రకటిం చడం నియంతృత్వ ధోరణికి నిదర్శనం. గతంలో మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు 'మీరు నామాట విని ట్రాన్స్‌ఫర్స్‌ను అంగీకరించాలి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టం. అగ్రిమెంట్ బాండ్‌ను వెనక్కి తీసుకుంటాం' అని చెప్పి ఇప్పుడు మాట తప్పుతున్నారు. అంటే వీసీ తన ఇష్టానుసారం పరిపాలన కొనసాగించాలనుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని మా సమస్యలు పరిష్కరించాలి. ఓయూ వీసీని రీకాల్ చేయాలి.
- డా.ధర్మతేజ, కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక అధ్యక్షుడు
బాండ్ మమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించేలా ఉన్నాయి
మేము 10 నుంచి 30 ఏండ్లుగా వర్సిటీలో అధ్యాపకులుగా పనిచేస్తున్నాం. ఉన్నపళంగా కాంట్రాక్టు అగ్రిమెంట్ బాండ్ ఇవ్వాలని కోరడం న్యాయంగా లేదు. ఇంతకాలం లేని సమస్య ఇప్పుడెందుకు వచ్చిందో వీసీ చెప్పాలి. బాండ్స్ మమ్మల్ని ఉద్యోగ భద్రతకు దూరం చేసేలా ఉన్నాయి. కాబట్టి తక్షణమే అగ్రిమెంట్ బాండ్‌ను ఉపసంహరించుకోవాలి.
- టి.వెంకటేశం, టీఎస్ యూసీటీఏ (సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు యూనియన్) అధ్యక్షుడు
మండలి నిర్ణయం మేరకే బాండ్
ఓయూ పాలకమండలి నిర్ణయం మేరకే బాండ్ అగ్రిమెంట్ విధానం ముందుకు వచ్చింది. కొన్ని యూనివర్సి టీల్లో, డిగ్రీ కళాశాలల్లో ఇది అమలు చేస్తాం. ఈనెల 24 లోపు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు బాండ్ ఇవ్వాలి. బాండ్లో ఉన్న అంశాలపై అనుమానాలు ఉంటే చర్చించవచ్చు. 24 వరకు బాండ్ ఇవ్వకుంటే మాకు ఎటువంటి సంబంధంలేదు. పాలకమండలి నిర్ణయానికి అందరూ కట్టుబడి నడుచుకోవాల్సిందే.
- ఓయూ రిజిస్ట్రార్ ప్రొ.పి.లక్ష్మీనారాయణ