Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెప్పడానికే అవమానం
- పారిశుధ్యంపై మేయర్ అసహనం
- ఆస్తిపన్ను, ఆహారకల్తీ, ఫైర్‌సేఫ్టీ, టౌన్‌ప్లానింగ్, దోమలు, తదితర అంశాలపై సభ్యుల ధ్వజం
- బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్
- పోడియం వద్దకు బీజేపీ కార్పొరేటర్లు
నవతెలంగాణ-సిటీబ్యూరో
'గ్రేటర్లో పారిశుధ్యం గింత అధ్వానమా..? చూస్తేనే సిగ్గనిపిస్తుంది. పరిస్థితి ఊహించుకుంటేనే నాకు అవమానంగా ఉంది. పారిశుధ్య పరిస్థితి చూస్తే కొన్ని సందర్బాల్లో ఎంతో బాధ కలుగుతుంది. అధికారులు ఏం చేస్తున్నారు. పారిశుధ్య నిర్వహ ణలో జీహెచ్ఎంసీ యంత్రాంగం విఫలమైంది' అని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. మంగళవారం జరిగిన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించిన మేయర్ పారిశుధ్యంపై చర్చ సందర్భంగా సభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఏకీభవించడంతోపాటు అధికారులపై మండిపడ్డారు. రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారు రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్తకుప్పలు పేరుకుపోతున్నాయనీ, ఫలితంగా దోమలు పెరిగి వ్యాధులు ముసురుతున్నాయనీ, ఇండ్ల నుంచి చెత్త తీసుకువెళ్లడం లేదనీ, అందుకు బాధ్యత ఎవరిదని సమావేశంలో సభ్యులు లేవనెత్తారు. ఇండ్ల నుంచి చెత్త సేకరణకు అవసరమైన స్వచ్ఛ ఆటోల్లేవనీ, సమస్యను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని బల్దియా అధికారులు ఎప్పుడూ ఇదే సమాధానం చెబుతున్నారని ఎమ్మెల్యే పాషాఖాద్రి అన్నారు. మొక్కుబడి సమాధానాలు కాకుం డా స్వయంగా మేయర్ క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితి పరిశీలించాలని సూచించారు. మేయర్ స్పందిస్తూ నగరంలో పారిశుధ్యం బాగులేకపోవడం నిజమేననీ, ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి తగిన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. సమస్య పరిష్కా రానికి ప్రత్యేక కమిటీ వేయాలని బీజేపీ సభ్యులు దేవర కరుణాకర్ కోరారు. సమస్య పరిష్కారానికి స్పెషల్ యాక్షన్‌ప్లాన్ రూపొంది ంచి, వచ్చే స్టాండింగ్ కమిటీ సమావేశం ముందుంచనున్నట్టు మేయర్ తెలిపారు. యాక్షన్‌ప్లాన్‌ను పైలట్‌గా ఒక ఏరియాలో అమలు చేసి, అనంతరం నగరవ్యాప్తంగా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ఈ సందర్భంగా 26 ఎజెండా అంశాలను జనరల్ బాడీ సమావేశంలో ఆమోదించారు. ఈ సమావేశం సందర్భంగా స్వాతంత్య్రోద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో 15 రోజుల పాటు నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవాలు విజయవంతంగా నిర్వహించుకున్నాం అన్నారు. భవిష్యత్ తరాల వారికి స్ఫూర్తినిచ్చేలా ఈ వజ్రోత్సవాల సందర్భంగా చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు గల వారందరూ పాల్గొని విజయవంతం చేశారని ఆమె తెలిపారు.
ప్రజారోగ్యంపై ఇంత నిర్లక్ష్యమా..?
గ్రేటర్లో విచ్చలవిడిగా ఆహారకల్తీ జరుగుతున్నా పట్టించుకో వడం లేదనీ, ఒక్క ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ మాత్రమే ఉన్నప్పుడు జరిగిన తనిఖీల కంటే 21మంది అదనంగా వచ్చాక తనిఖీలు తగ్గాయని బీజేపీ సభ్యులు శ్రవణ్ తెలిపారు. ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా ప్రజలకు అవగాహన కల్పించకపోవడంతో ఏకంగా పీఎం ఓకు, కేంద్రమంత్రి అమిత్‌షాలకు సైతం సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేస్తున్నారన్నారు. నీళ్ల నుంచి పాల దాకా, నూనెలు, పప్పులు, ఉప్పుల్లో కల్తీ, అధికధరల వసూలు జరుగుతున్నా చర్యల్లేవనీ, నిబంధనల మేరకు జరగాల్సిన తనిఖీలు జరగడం లేవన్నారు. హౌటళ్లు, హాస్టళ్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమా డుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్
బల్దియా కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర, జాతీయ స్థాయి అంశాలపై చర్చలు చేశారు. దోమలు విపరీతంగా పెరిగి సాయం త్రమైతే దాడిచేస్తూ రక్తం పీలుస్తున్నాయనీ, టీఆర్ఎస్ కరెంట్ బిల్లులు పెంచి రక్తం పీలుస్తుంటే, నగరంలో దోమలిలా రక్తం పీలుస్తున్నాయని బీజేపీ సభ్యుడు వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ వచ్చాక బిల్లులు పెంచలేదనీ, టీఆర్ఎస్ రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తుండగా, మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే బిల్లులు పెంచారనీ, మోటార్లకు మీటర్లు పెడుతున్నారని టీఆర్ ఎస్ సభ్యులు, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, మన్నె కవిత తదితరులు ధీటుగా సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, బీజేపీల మధ్య వాదోపవాదాలు, పరస్పరం దాడులు చేసుకునేంత పని చేశారు. అంతకుముందు బీజేపీ సభ్యులు టీఆర్ఎస్లోకి వెళ్లడంపై వాదోపవాదాలు జరిగాయి. టీఆర్ఎస్ కార్పొరేటర్లను కొనుగోలు చేసిందని బీజేపీ సభ్యులు అంటే టీఆర్ఎస్ చేస్తున్న కార్యక్రమాలు మెచ్చి వచ్చారని టీఆర్ఎస్ సభ్యులు చెప్పారు. దీంతో ఇరువురి మధ్య వాదోపవాదాలు మించి ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా మేయర్ పోడియం వద్దకు దూసుకు వెళ్లారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన విజయారెడ్డి పట్టుబట్టారు. ఆదివాసీ, బంజారాల కోసం భవనాలు నిర్మించారని ప్రస్తావిస్తూ టీఆర్ఎస్ సభ్యులు సీఎంకు కృతజ్ఞతలు తెలుపగా, జీహెచ్ఎంసీలో ఆ ప్రస్తావన ఎందుకంటూ బీజేపీ సభ్యులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా సభ రసాభాసగా మారింది.
అధికారుల సమాధానాలు, సభ్యుల అసంతృప్తి
సమావేశంలో సభ్యుల ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పారు. అయితే అధికారుల సమాధానాలకు సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ పెనాల్టీలు, డీఆర్ఎఫ్, ఫైర్‌సేఫ్టీపై ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్‌పై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టూలెట్ బోర్డులు, చిరు వ్యాపారులపై వేలాది రూపాయల పెనాల్టీ వేశారని మండిపడ్డారు. అందుకు సమాధానంగా విశ్వజిత్ మాట్లాడుతూ పెనాల్టీ వేసే ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరుగుతుందనీ, ఎలాంటి అవకతవకలు జరగలేదని చెప్పారు. చెరువుల పరిరక్షణలో లోపాలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ భవనాల ఆస్తి పన్ను భారీగా బకాయిలున్నందున వాటిని వసూలు చేయాలన్న డిమాండ్‌కు కమిషనర్ లోకేశ్‌కుమార్ స్పందించారు. ఆస్పత్రులు, విద్యాసంస్థలు, పోలీసు విభాగాలకు చెందిన ఆస్తిపన్ను రూ.3వేల కోట్లు ఉంటాయనీ, ప్రజలకు సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉన్నందున కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి పేరుకుపోయిన బకాయిలు కావడంతో ఏపీ ప్రభుత్వం 58 శాతం, తెలంగాణ 42శాతం చెల్లించాల్సి ఉన్న ఇబ్బందులను వివరించారు. ఫైర్‌సేఫ్టీ నిబంధనల మేరకు 15 మీటర్ల లోపు వాణిజ్య భవనాలకు ఎన్ఓసీ అవసరం లేదనీ, ఇకపై వాటికి కూడా తప్పనిసరి చేస్తూ ఫైర్‌సేఫ్టీ విభాగం ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనకు అనుమతి వచ్చాక అమలు చేయనున్నట్టు సీసీపీ దేవేందర్‌రెడ్డి తెలిపారు. హరితహారంలో మొక్కలు నాటడం తప్ప అనంతరం సంరక్షణ పట్టించుకోవడం లేరని సభ్యులు లేవనె త్తారు. మంత్రి మల్లారెడ్డి ప్రహరీగోడ కోసం 70 మొక్కలు తొలగిం చారని సభ్యులు వివరించారు. ఆస్తిపన్ను వసూళ్లు సవ్యంగా చేయడం లేదనీ, సెల్ఫ్ అసెసెమెంట్స్లో ఫోర్జరీ పత్రాలు సమర్పి స్తున్నారనీ, వాటిని నిరోధించే చర్యలు చేపట్టాలనీ, అక్రమాలు జరగకుండా చూడాలనీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లలో సదుపాయాలు, కోచ్‌లు లేరనీ, ఎస్ఎన్డీపీ పనులు పూర్తి కాలేదనీ, వానలొస్తే ముంపు సమస్యలు తప్పలేదనీ, ప్రభుత్వ భవనాల ఆస్తిపన్ను వసూళు చేయాలని సభ్యులు ప్రస్తావించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు వాణిదేవి, ఎంఎస్.ప్రభాకర్, అమిన్ఉల్ జాఫ్రీ, బొగ్గారం దయానంద్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అహ్మద్ పాషా ఖాద్రీ, మాగంటి గోపినాథ్, డిప్యూటీ మేయర్ శ్రీలత, అడిష నల్ కమిషనర్లు బి.సంతోష్, శ్రుతి ఓజా, ఈఎన్సీ జియాఉద్దీన్, సీఈ దేవానంద్, అడిషనల్ సీపీ శ్రీనివాస్, జోనల్ కమిషనర్లు మమత, పంకజ, శంకరయ్య, సామ్రాట్ అశోక్, రవికిరణ్, శ్రీనివాస్ రెడ్డి, వాటర్‌బోర్డు జీఎం క్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.