Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లబ్దిదారుల గుర్తింపు సర్వేను పూర్తి చేయాలి
- సొంత జాగాల్లో ఇండ్ల నిర్మాణానికి
- రూ.10 లక్షలు ఇవ్వాలి
- పట్టాలేని ఇండ్లకు జీవో 58 కింద పట్టాలివ్వాలి :
- తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక
- జిల్లా అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్లోని అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు తక్షణమే కేటాయించాలనీ, ఈ సేవతో పాటు కలెక్టర్ ఆఫీస్కు వచ్చిన అన్ని దరఖాస్తులను పరిశీలించి లబ్దిదారుల గుర్తింపు సర్వేను వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ డిమాండ్ చేసింది. బుధవారం హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించింది. సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర నాయకులు డీజీ నర్సింహారావు మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబా ద్లో ఇండ్లులేని పేదలు 4.57లక్షల మందిని గుర్తించారనీ, అందులో నగరంలో లక్ష ఇండ్లు కట్టిస్తామని ప్రభుత్వం గతంలో వాగ్దానం చేసిన ఇప్పటివరకు 3,660 మాత్రమే పేదలకు ఇండ్లు కేటాయించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక గ్రేటర్ పరిధిలో ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు సుమారు 7లక్షల మందికాగా.. కలెక్టర్ ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నవారు భారీ సంఖ్యలో ఉండగా.. నేటికీ లబ్దిదారుల గుర్తింపు సర్వే పూర్తి చేయలేదన్నారు. వెంటనే అన్ని దరఖాస్తులను పరిశీలించి లబ్దిదారుల గుర్తింపు సర్వే త్వరగా పూర్తి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగర శివార్లలో 80వేల ఇండ్ల నిర్మాణం పూర్తిచేసి రెండేండ్లు గడుస్తున్నా.. ఆ ఇండ్లను కేటాయిం చకుండా సర్కారు తాత్సారం చేస్తుందని వాటిని లబ్దిదారులకు కేటాయించాలన్నారు. నగరంలో దశాబ్దల క్రితం ఏర్పడిన అనేక బస్తీలలో బస్తీవాసులకు ఇప్పటివరకు ఇండ్ల పట్టాలివ్వలేదనీ, వారికి జీవో 58 కింద పట్టాలు జారీ చేయాలని కోరారు. స్వంత స్థలాలలో ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ.3లక్షల సహాయం చేస్తామని ప్రకటించిన్పటికీ నేటికీ అది అమలు కావడం లేదనీ, ఇండ్ల నిర్మాణానికి రూ.10లక్షలు కేటాయించడంతో పాటు ఈ పథకం అమలులో పెట్టాలని డీజీ నర్సింహారావు డిమాండ్ చేశారు. అలాగే రాజీవ్ గృహకల్ప లబ్దిదారులకు ఇండ్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలనీ, గుడిసెల స్థానంలో ప్రారంభించిన ఇండ్ల నిర్మాణం వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ సమస్యలన్నింటినీ తక్షణం పరిష్కరించి పేదవారి స్వంత ఇంటి ఆకాంక్షలను నెరవేర్చాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం ప్రతినిధుల బృందం జిల్లా డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లుని కలిసి వినతి పత్రం అందజేయగా.. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రంలో సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్, ఐద్వా నగర కార్యదర్శి కె.నాగలక్ష్మి, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీరాం నాయక్, తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ఆశయ్య, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, ఐద్వా రాష్ట్ర నాయకురాలు ఆశాలత, డీవైఎఫ్ఐ నగర కార్యదర్శి ఎండీ జావెద్, అవాజ్ నగర కార్యదర్శి ఎండీ అలీ, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి అశోక్ రెడ్డి, వృత్తిదారుల సమన్వయ కమిటీ నగర కార్యదర్శి జి.నరేష్, కేవీపీఎస్ నగర అధ్యక్షులు పాల్గొన్నారు.