Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బహుజన విద్యార్థి సంఘాలు
నవతెలంగాణ-ఓయూ
కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అగ్రిమెంట్, బాండ్ అమలు చేయాలనే ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని బహుజన విద్యార్థి సంఘాలు, ఓయూ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఎస్ఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ వేల్పుల సంజరు, ఓయూ జాక్ చైర్మెన్ కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భాంలో ఓయూ కాంట్రాక్టు ఉద్యోగుల పాత్ర మరువలేనిదన్నారు. అంటువంటిది నేడు వీసీ ఉద్యోగుల భద్రతకు ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకుంటూ నియంతలా ప్రవర్తిస్తున్నాడన్నారు. కాంట్రాక్టు ప్రొఫెసర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే మరొక వైపు వీసీ కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాలను అభద్రతలోకి నెట్టివేసే తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. వీసీగా రవీందర్ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపుగా ఓయూలో 1000 మంది ఉద్యోగులను తొలగించారని ఆరోపించారు. ఇప్పటికైనా కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో తమ వైఖరి మార్చుకోకుంటే వీసీకి తగిన విధంగా బుద్ది చెపుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు పులిగంటి వేణుగోపాల్, వలిగొండ నర్సింహ, అంబేద్కర్, రాజు బరిగేలా, స్వామి, ప్రవీణ్, శివ, శరత్ మహేష్, ఆనంద్, తరుణ్ పాల్గొన్నారు.