Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన కమిషనర్ నవీన్ మిట్టల్
నవతెలంగాణ-ధూల్‌పేట్
చారిత్రక సిటీ కళాశాల చరిత్రపై డిజిటల్ పైలాన్ రూపొందించడం అత్యంత స్ఫూర్తిదాయకమని కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. సిటీ కళాశాల శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా వందేండ్ల చరిత్రను రికార్డు చేస్తూ సినీ రచయిత, దర్శకుడు అజహర్ షేక్ ఆధ్వర్యంలో కాలేజీ యాజమాన్యం ప్రత్యేక వీడియో చిత్రాన్ని రూపొందించింది. ఈ వీడియో చిత్రాన్ని మెగాఫెస్ట్ సందర్భంగా గత నెల 26న ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆవిష్కరించగా బుధవారం కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ పైలాన్‌తో సిటీ కళాశాల కీర్తి చిరస్థాయిగా నిలుస్తుందని ప్రశంసించారు. ఈ బహత్తర చిత్రం రూపొందించడంలో చొరవ చూపిన ప్రిన్సిపల్ డా.పి.బాల భాస్కర్ని, అధ్యాపక వర్గాన్ని అభినందించారు. కళాశాల ఘన చరిత్రను, ఆవిర్భావ వికాసాలను, భవన నిర్మాణ విశిష్టతను, ఆయా రంగాల్లో ప్రముఖులైన పూర్వ విద్యార్థుల విశేషాలను, ఆచార్యుల వివరాలను ఈ తరానికి చాటి చెప్పే విధంగా ప్రత్యేకమైన వీడియో చిత్రాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు. మైక్ టీవీ అధినేత అప్పిరెడ్డి ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందించిన ఈ చిత్రంలో ప్రొఫెసర్.హరగోపాల్, ప్రొఫెసర్. నాగేశ్వర్, ప్రొఫెసర్.ఎస్వీ సత్యనారాయణ, విద్యాధర్ భట్, డాక్టర్.వెల్చాల కొండల రావు, డాక్టర్.విజయ ప్రసాద్, జె.కె.భారవి, డాక్టర్.రఫియా సుల్తానా తదితరులు కళాశాలతో తమకున్న అనుబంధాన్ని, కళాశాల తమ ప్రగతికి ఎలా తోడ్పడిందో అభిప్రాయాలను వ్యక్తంచేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ బాల భాస్కర్ తో పాటు ఉపాధ్యాయ బందం తదితరులు పాల్గొన్నారు.