Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షరతుల్లేకుండా ఉచిత బస్‌పాసులు ఇవ్వాలి
- ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్షుడు కె వెంకట్
నవతెలంగాణ-కాప్రా
పెరిగిన ధరలకు అనుగుణంగా వికలాంగుల పెన్షన్ రూ.10 వేలకు పెంచాలని ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్షుడు కె వెంకట్ డిమాండ్ చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 20 లక్షల మంది వికలాంగులు ఉన్నారని, కానీ వీరిలో కేవలం 4.83 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారని అన్నారు. ప్రతిఒక్కరికీ రేషన్ కార్డు మంజూరు చేయాలని, కాలపరిమితి ముగిసిన వికలాంగులకు సర్టిఫికేట్ పొందినప్పటి నుంచి ఏరియర్స్ చెల్లించాలని కోరారు. వికలాంగుల్లో 9 శాతం మంది మాత్రమే మాధ్యమిక విద్యా పూర్తిచేస్తున్నారని, 40 శాతంలోపు స్కూల్ లలో మాత్రమే ర్యాంపులు ఉన్నాయని అన్నారు. వికలాంగుల పిల్లలకు విద్యా ప్రత్యామ్నాయాలపై పాలకులకు చిత్తశుద్ది లేదన్నారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వికలాంగులను విద్యకు దూరం చేసే విధంగా ఉందని అన్నారు. వినికిడి లోపం నివారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మిషన్ వాత్సల్య పేరుతో బాలబాలికల సంరక్షణ పథకాలను కేంద్ర ప్రభుత్వం విలీనం చేయాలని ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. దీంతో మహిళలు, వికలాంగులు, బాలబాలికల సంరక్షణ ప్రమాదంలో పడుతుందని అన్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారి కోసం ప్రతి జిల్లా కేంద్రంలో వికలాంగుల స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని సూచించారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాక్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రయివేట్ పరం చేయడం వల్ల వికలాంగులు రిజర్వేషన్స్ దక్కకుండా పోతాయని అన్నారు. రిజర్వేషన్ల పరిరక్షణ కోసం ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. 40 శాతం వైకల్యం కలిగిన వికలాంగులు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులని 2016 ఆర్పీడీ చట్టం చెపుతుంటే.. రాష్ట్రంలో ఆర్టీసీ అధికారులు మాత్రం బధిరులు, మానసిక వికలాంగులు, అంధులకు 100 శాతం వైకల్యం ఉంటేనే రాయితీ బస్ పాస్పాసులు ఇస్తామని చెప్పడం సరైంది కాదన్నారు. షరతులు లేకుండా వికలాంగులకు ఉచిత బస్‌పాస్‌లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బాలయ్య, షేన్ బేగం, మున్ని, మేఘమాల, అనిల్, రాజు, ఆశీర్వాదం, మరియమ్మ పాల్గొన్నారు.