Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
మేడ్చల్ జిల్లాలో అనుమతిలేని వైద్యులతో నడుస్తున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ హెచ్చరించారు. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకుల సూచనల మేరకు గురువారం మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లోని వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కొన్ని ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌లు, క్లినిక్‌లు, కన్సల్టేషన్ రూమ్‌లు, పాలీ క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఫిజియోథెరపీ యూనిట్లు, డెంటల్ హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. అర్హత లేని వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, ఇతర అవసరమైన సిబ్బంది కూడా ఆ సంస్థల్లో పనిచేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. సరైన మౌలిక సదుపాయాలు, అవసరమైన వైద్య పరికరాలు, పారిశుధ్యం నిర్వహణ, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ లేకుండా కొన్ని క్లినికల్ సంస్థలు నడుస్తున్నాయని సమాచారం ఉందన్నారు. డిప్యూటీ డీహెంహెచ్‌ఓ ప్రోగ్రామ్ ఆఫీసర్లతో బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. చట్టం ప్రకారం నిబంధనలు పాటించని వైద్య సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.