Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తీర్పును సమర్దించిన హై కోర్టు
నవతెలంగాణ-హయత్‌నగర్
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నకొడుకే తమను ఇంటిలో నుంచి గెంటివేయడంతో ఆ వృద్ధ దంపతులు గుండెల్లోని బాధను దిగమింగుతూనే కొడుకు, కోడలిపై హ్యూమన్ రైట్స్ పీపుల్స్ కౌన్సిల్ సహకారంతో ఏడాది కాలంగా న్యాయపోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం వారి పోరాటం ఫలించింది. వివరాల్లోకి వెళితే.. మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని శ్రీ రామనగర్ కాలనీలో నివాసం ఉంటున్న కావేటి కౌసల్య, లింగమయ్య దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడ పిల్ల, ఆడ పిల్లకు పెళ్లి చేసి పంపించారు. ఇక పెద్దకొడుకు తల్లిదండ్రుల ఆస్తితో సంబంధం లేకుండా బయటికి వచ్చేశాడు. చిన్న కొడుకు కావేటి రాజశేఖర్ తల్లిదండ్రుల వద్దనే భార్యా పిల్లలతో కలిసి వుంటున్నారు. అయితే గతేడాది నుంచి రాజశేఖర్ తల్లిదండ్రులను ఇంటినుంచి గెంటివేయడంతో వార ఎల్బీనగర్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్కడ వారికి న్యాయం జరగకపోవడంతో తాను ఉన్నానంటూ హ్యూమన్ రైట్స్ పీపుల్స్ కౌన్సిల్ మెంబర్ అయిన గీతారెడ్డి పట్టువిడవకుండా వృద్ధుల వెంటఉంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆమారు కుమార్ వద్దకు వారిని తీసుకెళ్లి బాధను మొరపెట్టుకోగా కొడుకు, కోడలు రాజశేఖర్, జయశ్రీలను వారు ఉంటున్న ఇంట్లో నుంచి గెంటి వేసి ఆ వృద్ధులను ఇంట్లో ఉంచేలా చూడాలని పోలీసులను కలెక్టర్ ఆదేశించారు.కలెక్టర్ ఆర్డర్‌ను సవాలు చేస్తూ రాజశేఖర్ హై కోర్టును ఆశ్రయించాడు. ఈ విషయంలో కోర్టు కలెక్టర్ ఆర్డర్‌ను సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. ఆ తీర్పును గౌరవిస్తూ సరూర్ నగర్ రెవిన్యూ అధికారులు, ఎల్బీనగర్ పోలీసులు శుక్రవారం ఇంటితాళాలు పగుల గొట్టి ఆ వృద్ధులను వారి ఇంటిలోకి పంపించి న్యాయం చేశారు. దీంతో ఇరుగుపొరుగు వారు హర్షం వ్యక్తం చేశారు.