Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో
- రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సిహెచ్. మల్లారెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
అన్ని మతాలను రాష్ట్ర ప్రభుత్వం సమానంగా గౌరవిస్తోందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు అందించే చీరలు తెలంగాణ రాష్ట్ర ఆడపడుచుల కోసం కేసీఆర్ అందించే సారె లాంటిదని అన్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బొమ్మకు బాలయ్య గార్డెన్లో జరిగిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని మతాలను సమానంగా గౌరవించుకునే సంప్రదాయం మనది అని, అందుకే తీరొక్క రంగుల చీరలను బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కనుమరుగు చేసే కుట్రలు అనేకం జరిగినా కలిసికట్టుగా అందరం తెలంగాణ సంస్కృ కాపాడుకున్నామని అన్నారు. తెలంగాణ చేనేతకు ఎంతో ప్రసిద్ధి గాంచిన సిరిసిల్ల కార్మికులతో బతుకమ్మ చీరలు తయారు చేయించి, వారికి ఉపాధి అందించిన ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కిందన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న కేసీఆర్ సర్కారుకు అండగా ఉండాలని కోరారు. మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా దాతల సహకారంతో చెంగిచెర్లలో నూతన హైస్కూల్ నిర్మాణానికి ఈ రోజే (శుక్రవారం) శంకుస్థాపన చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్, కమిషనర్ కె.పద్మాజారాణి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, కార్పొరేషన్ కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
పీర్జాదీగూడ లో....
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి, మేయర్ జక్క వెంకట్రెడ్డి హాజరై చీరలను పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మత సామరస్యానికి చిహ్నంగా కుల, మత, వర్ణ, వర్గ, ప్రాంతీయ భేదాలకు అతీతంగా సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. పండుగలకు కానుకలు పంపిణీ చేస్తోందన్నారు. రూ. 300 కోట్లకుపైగా ఖర్చుతో సుమారు కోటికి పైచిలుకు బతుకమ్మ చీరలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఒంటరి మహిళలకు, వితంతువులకు, వృద్ధులకు, వికలాంగులకు, బీడీ కార్మికులకు ఆసరా పింఛన్లను అందజేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. ఈ సందర్బంగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.... బతుకమ్మ పండుగ సందర్బంగా ప్రతి పేదింటి ఆడపడుచు ముఖంలో చిరునవ్వుతో పాటు వారి హృదయాల్లో సంతోషం నింపాలానే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపడుచులకు అన్నగా కొత్త బట్టలు అందించడం సంతోషంగా ఉందన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డిప్యూటీ మేయర్ కుర్రశివ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు, కో- ఆప్షన్ సభ్యుల సహకారంతో బతుకమ్మ, దసరా పండుగ సంబురాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు. కమిషనర్ డా. పి. రామకృష్ణ రావు, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.