Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లాఠీతో రక్తం వచ్చేలా కొట్టడంతో తీవ్రగాయాలు
- గాయాలతో ఇంటికి వెళ్లి పడిపోయిన డ్రైవర్
- ఈనెల 21 రాత్రి జరిగిన ఘటన
- మహంకాళి పోలీస్ స్టేషన్‌కు వచ్చి నిలదీసిన కుటుంబ సభ్యులు
- కానిస్టేబుల్‌పై ఫిర్యాదు
- చర్యలు తీసుకుంటామన్న సీఐ
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఏదైనా జరిగితే పోలీసులు తమను కాపాడతారని సహజంగా అందరూ అనుకుంటారు. కానీ కొందరు పోలీసులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలతో దురుసుగా ప్రవర్తిస్తూ తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. నగరంలో ఓ కానిస్టేబుల్ అలాగే వ్యవహరించాడు. కనీస మానవత్వంలేకుండా ఓ వ్యక్తిని వాతలు వచ్చేలా.. కర్తం కారేలా దారుణంగా కొట్టాడు.. ఒకవైపు పోలీసు ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరితో కూడా మర్యాదగా మాట్లాడాలి అని, ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్తున్నా కొందరు వాటిని నిర్లక్ష్యం చేసి డిపార్టుమెంట్‌కు చెడ్డపేరు తెస్తున్నారు. కొందరు పోలీసులు మాత్రం అరే.. తురే అంటూ మాట్లాడుతూ.. ఏకంగా ప్రాణాలు పోయేలా కొడుతున్నారు. అలాంటి అమానుష ఘటన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.. తప్పు జరిగినపుడు సరిదిద్దాల్సిన ఉన్నతాధికారులు తప్పును కప్పిపుచ్చేలా బాధితులను బెదిరించి కేసులు లేకుండా రాజీ ప్రయత్నాలు చేయడం ఇంకా దారుణం. రాణిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజు అనే వ్యక్తి లారీ అడ్డావద్ద డీసీఎం పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 21న రాత్రి రాజుకు, మరో డ్రైవర్‌కు మధ్య గొడవ జరిగింది. అనంతరం గొడవ పడిన డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోగా రాజు లారీ అడ్డావద్దే పడుకున్నాడు. అయితే గొడవ జరిగిన సమయంలో ఓ వ్యక్తి పోలీసుల టోల్ ఫ్రీ నెంబర్ 100కు ఫోన్ చేశాడు. దాంతో మహంకాళీ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్ అక్కడి చేరుకుని రాజును ప్రశ్నించాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. నాకే ఎదురుచెప్తావా అంటూ కానిస్టేబుల్ ఊగిపోయాడు. ఇక తాను ఒక మనిషిని ఎదురుగా మరో మనిషే ఉన్నాడు అనే విజ్ఞత కోల్పోయి ప్రవర్తించాడు. రాజును లాఠీతో ఇష్టమొచ్చినట్టు కొట్టాడు. అంతటితో ఆగకుండా బూటు కాళ్ళతో తన్నాడు, ఒళ్లంతా వాతలు వచ్చేలా, రక్తాలు కారేలా కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక రాజు తీవ్రగాయాలతో ఎలాగోలా ఇంటికి వెళ్లిపడిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి ఈ ఘటనపై ప్రశ్నించేందుకు శుక్రవారం మహంకాళి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఇదిలావుండగా దాడికి పాల్పడిన కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు రాజీ చేసే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. బాధితుల పైనే కేసులు పెడతామంటూ బెదిరించినట్టు సమాచారం. అయితే గొడవ పెద్దది కావడంతో ఉన్నతాధికారులు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్టు తెలిసింది. బాధితున్ని పద్మారావు నగర్‌లోని పల్స్ ఆస్పత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. బాధితుడి ఎడమ చెయ్యి విరిగినట్టు డాక్టర్లు ధ్రువీకరించినట్టు తెలిసింది.
చట్లపరమైన చర్యలు తీసుకుంటాం : సీఐ
రాజును కానిస్టేబుల్ కొట్టింది వాస్తవమే, బాధితుడు ఫిర్యాదు చేస్తే కేసునమోదు చేస్తాం. మేము ఎవరినీ బెదిరించలేదు. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రాణిగంజ్ ప్రాంతంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో 100కు ఫోన్ రాగా కానిస్టేబుల్ అక్కడికి వెళ్లారు. మాటా మాటా పెరగడంతో మా సిబ్బంది వారిని కొట్టిన మాట వాస్తవమే. ప్రయివేట్ ఆస్పత్రిలో మెరుగైన చికిత్సను అందిస్తాం.
- మహంకాళీ ఎస్‌హెచ్‌వో, ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసులు