Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనుమతులు లేకుండా రోడ్లపైకి వాహనాలు
- ఒకే పర్మిట్‌తో నాలుగైదు కార్ల తిప్పుతున్న వైనం
- వందల సంఖ్యలో అనుమతిలేని స్కూళ్లు
- రవాణాశాఖ నిబంధనలు బేఖాతర్
- రంగంలోకి దిగిన ఆర్టీఏ ప్రత్యేక బృందాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలో డ్రైవింగ్ స్కూళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. రవాణాశాఖ నిబంధనలను తుంగలో తొక్కుతూ అనుమతి పత్రాలు లేకుండానే రోడ్లపైకి ఎడాపెడా వచ్చేస్తున్నాయి. ఇక కొంతమంది నిర్వాహకులైతే ఏకంగా ఒక డ్రైవింగ్ స్కూల్ పేరుతో పర్మిట్ తీసుకుని అదనంగా రెండు మూడేసి తిప్పుతున్నారు. దీనికితోడు ఫీజుల విషయంలో నియంత్రణ లేకపోవడంతో అందినకాడికి దోచుకుంటున్నాయి. తద్వారా డ్రైవింగ్ నేర్చుకునే వారిని నిలువు దోపీడీ చేస్తున్నాయి. ఇప్పటివరకు ఆర్టీఏ అధికారులు దీనిపై పెద్దగా దృష్టిపెట్టకపోవడంతో నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో రవాణాశాఖకు పలు ఫిర్యాదులు అందడంతో అలర్ట్ అయ్యింది. ఆయా స్కూళ్లపై నిఘా పెట్టింది. హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ జే.పాండురంగ నాయక్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి తనిఖీలు చేపడుతున్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల ఈ తనిఖీలు చేపట్టి రూల్స్‌కు వ్యతిరేకంగా నడుస్తున్న డ్రైవింగ్ స్కూళ్లపై కేసులు నమోదు చేసి ఫైన్ వసూలు చేశాయి.
గ్రేటర్ పరిధిలో సుమారు 500లకుపైనే డ్రైవింగ్ స్కూళ్లు ఉంటాయి. హైదరాబాద్ రవాణాశాఖ పరిధిలో 200 వరకు ఉండగా.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మరో 300 స్కూళ్లు పనిచేస్తున్నాయి. ఈ స్కూళ్ల నిర్వహకులు కార్లు, అవసరమైతే టూ-వీలర్ వాహనాలకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేస్తారు. ఇలా వీరివద్ద ప్రతినెలా వందల మంది శిక్షణ పొందుతున్నారు. ఇదిలాఉంటే మూడు జిల్లాల పరిధిలో వెలిసిన 500పైగా డ్రైవింగ్ స్కూళ్ల్లలో సుమారు 150కుపైగా అనుమతుల్లేని స్కూళ్లు ఉన్నట్టు సమాచారం. ఇందులో చాలామంది నిర్వాహకులకు కనీస అవగాహన లేకపోవడం శోచనీయం. కాగా ఆయా డ్రైవింగ్ స్కూళ్లు మెకానికల్, థిóయరీ క్లాసులు నిర్వహించకుండానే సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారని తెలుస్తోంది. కొద్దిరోజుల కిందట ఆర్టీఏ అధికారులు చేసిన తనిఖీల్లోనూ ఇవే వెలుగుచూశాయి. ముఖ్యంగా కొంతమంది నిర్వాహకులు కనీస ప్రమాణాలు పాటించడం లేదు. లెర్నింగ్ లైసెన్స్ లేకుండా డైరెక్టుగా స్టీరింగ్ ఇచ్చేస్తున్నారు. వారి భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదు. అంతేగాక కొన్నిచోట్ల నిర్వాహకులు అయిదేండ్లు దాటిని సదరు డ్రైవింగ్ స్కూల్ పర్మిట్, ఆర్సీగానీ రెన్యూవల్ చేసుకోకపోవడంతో పాటు ఒకే పర్మిట్‌పై అదనంగా నాలుగైదు కార్లను తిప్పుతున్నట్టు ఆర్టీఏ అధికారులు తనిఖీల్లో గుర్తించారు. వారిపై ఇప్పటికే కేసులు కూడా నమోదు చేసి ఫీజులు వసూలు చేశారు. ఇలాంటి వాటిపై గతంలో అధికారులకు ఫిర్యాదులు అందినప్పటికీ చూసిచూడనట్టు వదిలేస్తున్నారనే విమర్శలుండేవి. కానీ ఇప్పుడు వీటిపై సీరియస్‌గా దృష్టిసారించాలని ఆర్టీఏ అధికారులు నిర్ణయించడంతో డ్రైవింగ్ స్కూళ్ల నిర్వాహకులు హడలెత్తిపోతున్నారు. ఆర్టీఏ కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు.
రెన్యువల్ లేకుండా తిప్పసేస్తున్నారు.. !
వాస్తవానికి డ్రైవింగ్ స్కూళ్ల నిర్వహణకు సంబంధించి అన్ని నియమ నిబంధనలు పాటించారా? లేదా అనేది ఆర్టీఏ పరిశీలిస్తుంది. దరఖాస్తులను పరిశీలించి వాటికి 5 ఏండ్ల వ్యవధితో లైసెన్స్‌ను జారీ చేస్తుంది. అనంతరం వాటిని నియమిత కాలం ప్రకారం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. లైసెన్స్ ఫీజు రూ.10 వేలు ఉంటుంది. చాలావరకు డ్రైవింగ్ స్కూళ్ల నిర్వాహకులు తమ లైసెన్సులను రెన్యువల్ చేసుకోకుండా ఇష్టారాజ్యంగా వాహనాలను తిప్పుతూ, అక్రమంగా డ్రైవింగ్ స్కూల్ ఆఫీసులను నడిపిస్తున్నారు. మరికొంత మంది ఒక పర్మిట్‌పై పదుల సంఖ్యలో స్కూళ్లను నిర్వహిస్తున్నారు. ఇందులో చాలా స్కూళ్లు పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వకుండా లైసెన్స్‌లు ఇప్పించి చేతులు దులుపుకుంటున్నారు. దాంతో వారు సరైన శిక్షణ లేకుండా రోడ్ల మీదకు వాహనాలను తీసుకువస్తూ తరుచు యాక్సిడెంట్లు చేస్తూ వారు ప్రమాదాల బారిన పడకుండా ఇతరులను కూడా ప్రమాదాల బారిన పడేస్తున్నారు. అధికారులు ఇప్పటివరకు ఇలాంటి వాటిని కట్టడి చేసే దిశగా చర్యలు తీసుకున్నట్టు దాఖలాలు లేవు. ఇప్పటికైనా వీటికి ముకుతాడు వేయాలంటే తనిఖీలు తరుచూ చేయాల్సి ఉంటుంది. ఏడాదిలో ఒకటి లేదా అంతకు మించి ఆకస్మిక తనిఖీలు చేస్తేనే అనుమతి లేని డ్రైవింగ్ స్కూళ్లకు చెక్‌పెట్టవచ్చునని పలువురు అభిప్రాయపడుతున్నారు.
నిబంధనలు ఇలా..
డ్రైవింగ్ స్కూల్ నిర్వహించాలనుకునే ఇన్స్ట్రక్టర్ తప్పనిసరిగా ఆటోమొబైల్, ఐటీఐ (డీజిల్ మెకానిక్) కోర్సు పూర్తిచేసి ఉండాలి. శిక్షణ పోందే వారికి డ్రైవింగ్‌లో మెళుకువలు నేర్పేందుకు శిక్షణ తరగతులు నిర్వహించాలి. వీటి కోసం తప్పని సరిగా క్లాస్ రూం ఏర్పాటు చేసుకోవాలి. డ్రైవింగ్ నేర్చుకునే వాహనానికి డ్యూయల్ క్లచ్, ఎక్స్‌లేటర్, బ్రేక్ తప్పని సరిగా ఉండాలి. నిష్ణాతులైన డ్రైవర్లు శిక్షణ ఇవ్వాలి. అదే విధంగా వాహనా విడిభాగాలపై పూర్తి అవగాహన కల్పించాలి. వాహనంపై డ్రైవింగ్ శిక్షణ పోందే అభ్యర్థులకు అవగాహన క్లాసులు నిర్వహించాలి. పూర్తి స్థాయిలో శిక్షణ పోందిన తర్వాత స్కూల్ నుంచి సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఆ తరువాత ఆర్టిఏ కార్యాలయానికి వెళ్ళి డ్రైవింగ్ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. శిక్షణ ఇవ్వడం వరకు స్కూళ్ల బాధ్యత, డ్రైవింగ్ స్కూళ్ల నిర్వాహకులు ఆయా వాహనాల శిక్షణ కోసం నెల రోజుల సమయం తీసుకుంటారు. ఇదే సమయంలో అన్ని రకాల శిక్షణ అందిస్తారు.