Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తింటుండగా బయటపడ్డ పురుగులు
- ఆందోళనకు దిగిన వినియోగదారులు
- రూ.30వేల జరిమానా విధించిన జీహెచ్ఎంసీ
నవతెలంగాణ-కాప్రా
కుషాయిగూడ డీమార్ట్‌లో కుళ్లిపోయి, పురుగులు పట్టిన ఖర్జూర పండ్లు వెలుగు చూశాయి. శుక్రవారం ఉదయం 11:40 నిమిషాల సమయంలో కుషాయిగూడ న్యూ వాసవీ శివనగర్‌కు చెందిన చంద్రశేఖర్ సామానుతో పాటు లయన్ డేట్స్ కంపెనీకి చెందిన అరకిలో ప్యాకెట్ల ఖర్జూర పండ్లను కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో డీ మార్ట్ ఎదురుగా తన నాలుగేండ్ల చిన్నారి రిత్విక్ ఆ పండ్లను తినడం కోసం సీల్ ఓపన్ చేసి పండును నోట్లో పెట్టుకోగా మూతి పై పురుగులు పారుతుండటంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. అనుమానం వచ్చి చూడగా లోపల కుళ్ళిపోయి పురుగులు తిరుగుతున్న పండ్లు దర్శనమిచ్చాయి. దీంతో అవాక్కయిన వినియోగదారుడు ప్యాకింగ్ తేదీని పరిశీలించగా సెప్టెంబర్ 2, 2022 అని ప్యాకెట్ పై ఉంది. ప్యాకెట్‌పై ఆరు మాసాల గడువు అనగా 2023 మార్చి ఎక్స్పైరీ తేదీ ఉన్నప్పటికీ ఖర్జూర పండ్లు పూర్తిగా కుళ్ళు పోయిన వాసనతో నిండా పురుగులతో దర్శనమిచ్చాయి. ప్యాకింగ్ తేదీ సవ్యంగా ఉండి ప్యాకెట్ సీల్ మంచిగా ఉన్నప్పటికీ లోపల మాత్రం పండ్లు కుళ్లి బూజు పట్టి పురుగులు నిండి రావడంపై వినియోగదా రుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. దీనిపై సంబంధిత లయన్ డేట్స్ చిరునామా ఉంది. డీ మార్ట్ షాపింగ్ మాల్లో నాణ్యత గల వస్తువులు ఉంటాయని నమ్మకంగా కొనుగోలు చేస్తే.. మోసపూరితంగా ప్యాకింగ్ డబ్బాలు విక్రయిస్తున్నారని వినియోగదారుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. నాణ్యతా ప్రమాణాలు పాటించని లయన్ డేట్స్ కంపెనీ పై, మోసపూరితంగా విక్రయం చేస్తున్న కుషాయిగూడ డీమార్టుపై చర్యలు తీసుకోవాలని కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శంకర్‌కి, సర్కిల్ ఏఎంఓహెచ్ వైద్యాధికారి డాక్టర్ స్వప్నకు ఫిర్యాదు చేస్తానని వినియోగదారుడు పేర్కొన్నాడు.
కుషాయిగూడ డీమార్ట్‌కు మరోసారి జరిమానా..
కుళ్లిపోయి పురుగులు పట్టిన లయన్ డేట్స్, పుచ్చిపోయిన పప్పు తదితరాలు వినియోదారులకు అమ్మి మోసం చేస్తున్నారని వినియోగదారులు చేసిన ఫిర్యాదు మేరకు కాప్రా సర్కిల్ ఏఎంఓహెచ్ వైద్యాధికారి డాక్టర్ స్వప్న డిమార్ట్‌ను సందర్శించి వస్తువులను పరిశీలించి కల్తీ పురుగులు పట్టిన విషయం నిజమని తేలడంతో డిమార్ట్‌కు రూ.30వేల జరిమానా విధించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని డీమార్ట్ బాధ్యులను డాక్టర్ స్వప్న హెచ్చరించారు.