Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర సర్కారుపై సీపీఐ(ఎం) నేతల ఆగ్రహం
- పలుచోట్ల ర్యాలీలు, ధర్నాలు, దిష్టిబొమ్మ దహన కార్యక్రమాలు
నవతెలంగాణ-సంతోష్‌నగర్/కుత్బుల్లాపూర్
బాలానగర్/జూబ్లీహిల్స్
రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో సామాన్య ప్రజలు అల్లాడుతున్నారని, ఏమీ కొనలేని, తినలేని పరిస్థితి ఏర్పడిందని, నిరుపేదలు అర్థాకలితో గడుపుతున్నారని సీపీఐ(ఎం) నాయకులు అన్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ధరలు నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నం చేయపోగా జీఎస్టీ పేరుతో తిరోగమన ఆర్థిక విధానాలతో ధరలు మరింత పెరిగేందుకు కారణం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ధరలు నియంత్రించాలని, ధరలు నియంత్రించకుంటే గద్దె దిగాలని కేంద్ర సర్కారుపై మండిపడ్డారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ పీలుపుమేరకు శనివారం గ్రేటర్హైదరాబాద్లో కేంద్రం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, ధరల పెంపుదలపై ధర్నాలు చేపట్టారు. కేంద్ర సర్కారు దిష్టిబొమ్మను దహనం చేశారు.
సంతోష్‌నగర్ చౌరస్తాలో...
సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సౌత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంతోష్‌నగర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సౌత్ కమిటీ కార్యదర్శి ఎం.డి.అబ్బాస్ మాట్లాడు తూ... జీఎస్టీ పేరుతో కేంద్ర సర్కారు ప్రతివస్తువుపై ధరలను పెంచుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎస్టీ కౌన్సిల్ జరిగిన ప్రతీసారి 10 నుంచి 20 శాతానికి పైగా వివిధ వస్తువులపై ధరలు పెంచి, ఆ భారాన్ని ప్రజలపై మోపుతున్నారని చెప్పారు. దీనివల్ల సామాన్య ప్రజలు కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితికి కేంద్ర సర్కారు నెట్టిందన్నారు. అధికారంలోకి వస్తే ధరలు నియంత్రిస్తామని, స్థిరీకరిస్తామని, దీనికోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని 2014 ఎన్నికల వేళ వాగ్దానం చేసిన నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చాక మాత్రం ఎటువంటి చర్యలూ తీసుకోవడంలేదన్నారు. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనం బయటకు తెస్తామని, ప్రతీ అకౌంట్లో 15లక్షలు వేస్తామని చెప్పిన మాటలు, హామీలు తుంగలో తొక్కారని విమర్శించారు. డీజిల్, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలు 2014తో పోల్చుకుంటే నేడు మూడురెట్లు పెరిగాయన్నారు. మరోవైపు నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిందని, ఉపాధి మార్గాలు లేకుండా పోతున్నాయని, రోజు కూలీ దొరకని పరిస్థితి నెలకొందని చెప్పారు. ప్రజల ఆదాయం తగ్గి, ఆకలి చావులు పెరిగాయన్నారు. దేశానికి ఆదాయం తెచ్చిపెట్టే ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు, రైల్వేలు, పోస్టల్, బీఎస్ఎన్ఎల్ వంటి సంస్థలను ప్రయివేటు పరం చేశారని, ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ మరోవైపు కార్పొరేట్ కంపెనీలకు వందల, వేల కోట్ల రాయితీలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ధరలను నియంత్రించాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరిం చాలని, ఉపాధిహామీ నిధులు పెంచి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 17 రకాల నిత్యావసర సరుకులను రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు ఉచితంగా సరఫరా చేయాలన్నారు. తెల్ల రేషన్ కార్డులులేని వారికి, అర్హులైన వారికి వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై ధర్నా సందర్భంగా సీపీఐ(ఎం) నాయకులను పోలీసులు అరెస్టు చేసి సైదాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సౌత్ కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు జి.విఠల్, ఎల్.కోటయ్య, పి.నాగేశ్వర్, ఎం.మీనా, జిల్లా కమిటీ సభ్యులు ఎం.లక్ష్మమ్మతో పాటు అబ్దుల్ సత్తార్, అబ్దుల్ లతీఫ్, ఎం.బాలు, ఎం.శ్రావణ్, శశికళ, జంగయ్య, కిషన్, కల్యాణ్, ఎ.క్రిష్ణ పాల్గొన్నారు.
షాపూర్‌నగర్‌లో ..
సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కీలకాని లక్ష్మణ్
కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలపై సీపీఐ(ఎం) కుత్బులా ్లపూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో షాపూర్‌నగర్ రైతుబజార్వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆ పార్టీ మండల కార్యదర్శి కీలు కాని లక్ష్మణ్ మాట్లాడుతూ... కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో డీజిల్, పెట్రోల్, గ్యాస్, నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. ధరల నియంత్రణలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పేదలను, కార్మికులను, మధ్యతరగతి ప్రజలను విస్మరించి ఆదాని, అంబానీల సేవలో మునిగి తేలుతోందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని, కారుచౌకగా కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతోందని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు కేంద్రం మానుకోవాలని, లేకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ నాయకులు పి.అంజయ్య, కె.బీరప్ప, ఇ.దేవదానం, ఆర్.స్వాతి, నాగేశ్వరరావు, మల్లారెడ్డి, యేసు, కరుణాకర్, కె.శీను పాల్గొన్నారు.
బాలానగర్‌లో...
కేంద్రంలోని బీజేపీ సర్కారు ధరలు పెంచుతూ ప్రజలపై భారాన్ని మోపుతోందని, దీనిని ప్రజలు ప్రతిఘటించాలని సీపీఐ(ఎం) బాలానగర్ మండల కార్యదర్శి ఐలాపురం రాజశేఖర్ పిలుపునిచ్చారు. కేంద్రం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా శనివారం బాలానగర్ మండల కమిటీ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భం గా రాజశేఖర్ మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేని పరిస్థితిలో కేంద్ర సర్కారు ఉందన్నారు. ఈ సమస్య పరిష్కరించకుండా దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందన్నారు. జీఎస్టీ విధించి ప్యాకింగ్ ఆహార పదార్థా లపై ఐదు శాతం నుండి 15 శాతం వరకు జీఎస్టీని పెంచింద న్నారు. ఆహార ధాన్యాలపై 5 శాతం, డ్రై ఫ్రూట్స్ పై 12 శాతం, పిండివంటలకు 18 శాతం, మజ్జిగ, లస్సీపై 5 శాతం డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్‌లపై 31 శాతం పెచిందన్నారు. ఇప్పటికైనా ప్రజావ్యతిరేక విధనాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు పి.శంకర్, సుగుణ, నవనీత, వనిత, లక్ష్మి, సాయి ప్రసాద్, శ్రీనివాస్, భాస్కర్, మంగ తదితరులు పాల్గొన్నారు.
కాప్రా తహసీల్దార్ ఆఫీసు ఎదుట
కాప్రా తహసీల్దార్ ఆఫీసు ఎదుట సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధరలను నియంత్రించాలని ధర్నా చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి పి.సత్యం మాట్లాడుతూ.. బీజేపీ సర్కారు అవలంభిస్తున్న ఆర్థిక విధానాల వల్లే దేశంలో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయన్నారు. ధరలు అదుపు చేయలేని ప్రభుత్వం గద్దె దిగాలని డిమాండ్ చేశారు. మరోవైపు మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. స్వాతంత్య్ర పోరాటంలో కానీ, తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ బీజేపీ పాత్ర ఏమాత్రమూ లేదన్నారు. నాడు దొరలకు, నిజాముకు, అదేవిధంగా బ్రిటిష్ వారికి తొత్తులుగా పనిచేసిన వీరి పునాది పూర్వ సంఘం ఆర్ఎస్ఎస్ అని అన్నారు. అనంతరం తహసీల్దార్‌కు మెమోరాండం ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) సర్కిల్ కార్యదర్శి పి.వెంకట్, నాయకులు యాదగిరిరావు, శ్రీనివాసులు, గణేష్, సఫియా, అఖిల్ పాషా, సోమయ్య చారి, రాజు రాములు కృష్ణమూర్తి, అంజిరెడ్డి, సత్యనారాయణ, నందిని, లక్ష్మి, ఎం.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
ఉప్పల్‌లో...
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలోఉప్పల్ రింగ్‌రోడ్డు వద్ద ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఆ పార్టీ నాయకులు ఎర్రం శ్రీనివాస్, జె. వెంకన్న, వినోద మాట్లాడారు. ప్రతిరోజు సమీక్ష పేరుతో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచుతూ కేంద్రం సామాన్య ప్రజలపై భారాలు మోపుతోందన్నారు. ధరలను తగ్గించి, ప్రజలకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎం. శ్రీనివాస్, వెంకన్న జై, భీష్మచారి, వై.వెంకటేశ్వర్, పద్మ, కిరణ్, నాగరాజు, ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, ప్రసాద్, జోసఫ్, యాదగిరి, ఆటో యూనియన్ నాయకులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
జూబ్లీహిల్స్‌లో
వెంటనే ధరలు తగ్గించాలని, లేబర్ కోడ్లు రద్దు చేయాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రహమత్‌నగర్ డివిజన్, ఎస్పీఆర్ హిల్స్‌లో సీపీఐ(ఎం), సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిం చారు. నాయకులు సాయి శేషగిరిరావు, ఆర్.అశోక్, ఏఆర్ నరసింహ, భాగ్యరాజు తదితరులు పాల్గొన్నారు.