Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా ఉద్యోగులందరూ పాల్గొనేలా చూడాలి
- ప్రతిరోజూ ఒకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ఉండాలి
- మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ పండగను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. ఈ నెల 25వ తేదీన ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై అక్టోబర్ 3వ తేదీన సద్దుల బతుకమ్మ వరకు ఘనంగా జరుపుకొనేలా అన్ని ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. ఇందుకు ప్రత్యేకంగా జిల్లా అధికారులతో కమిటీని ఏర్పాటు చేశామని తెలి పారు. తెలంగాణ సంస్కతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచి ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మ వరకు 9 రోజుల పాటు నిర్వహించనున్న బతుకమ్మ పండగ ఏర్పాట్లు జిల్లా లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేలా చూడాలన్నారు. నేటి నుంచి బతుకమ్మ పండగను జిల్లా వ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు నిర్వహించనున్న దృష్ట్యా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలనీ, ప్రతిరోజూ ఒక శాఖ నుంచి బతుకమ్మను ఆడేలా మహిళా అధికా రులు, సిబ్బందిని ఎంచుకోవాలని తెలిపారు. జిల్లాలోని మహిళా ఉద్యోగులందరూ బతుకమ్మ ఆటలు ఆడేలా చూడాలన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిలలోనే కాకుండా దేశం, ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ పండుగను ప్రచారం చేసినట్టు తెలిపారు. కోవిడ్ 19 నేపథ్యంలో రెండేండ్లపాటు పెద్ద ఎత్తున జరుపుకోలేక పోయామనీ, ఈసారి ఘనంగా నిర్వహించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సద్దుల బతుకమ్మతో పాటు అంతకు ముందు వచ్చే బొడ్డెమ్మ బతుకమ్మల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాన్నారు. ఈ విషయంలో లైన్ డిపార్టుమెంట్, సభ్యుల సమన్వయంతో గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు చేయాలనీ, స్వయం సహాయక బృందం, మహిళా ప్రజాప్రతినిధులు ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చూడాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజూ సవివరమైన కార్యక్రమాలతో రోజు వారీ షెడ్యూల్‌ను సిద్ధం చేయడంతో పాటు నీటి వనరులు, రోడ్లు మొద లైన వాటికి అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపర్చా లని తెలిపారు. జిల్లా స్థాయిలో ఆరుగురు జిల్లా స్థాయి అధికా రులతో ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిణి పద్మజారాణి కమిటీ కన్వీనర్‌గా వ్యవహరించనుండగా.. జిల్లా విద్యాశాఖ అధికారిణి విజయకుమారి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిణి పద్మ, జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ అభివృద్ధి అధికారిణి ఝాన్సీరాణి, జిల్లా సంక్షేమాధికారిణి పావని, జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ హరీశ్ తెలిపారు. ఈ మేరకు ఈ కమిటీ సభ్యులందరూ ప్రతి రోజూ సమన్వయం చేసుకొంటూ సద్దుల బతుకమ్మ పండుగ అక్టోబర్ 3వ తేదీ వరకు ప్రత్యేకంగా అవసర మైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. తొమ్మిది రోజుల పాటు జిల్లాలోని అన్ని శాఖల మహిళా ఉద్యోగులు పాల్గొనేలా చూడాలని వివరించారు. బతుకమ్మ ఉత్సవాల్లో ఆయా శాఖలకు సంబంధించిన వారు శాఖలకు ప్రాధాన్యతనిస్తూ కార్యక్రమాలలో పాల్గొనేలా ప్రణాళికలను సిద్దం చేసుకోవాలని కలెక్టర్ హరీశ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ చివరి రోజున నిమజ్జనం చేసే సమయంలో ఆయా చెరువులు, కుంటల వద్ద లైటింగ్, శానిటైజేషన్ ఏర్పాట్లు సక్రమంగా ఉండేలా చూడాలని అదికారులను ఆదేశించారు.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 16వ తేదీన టీఎస్పీఎస్సీ ఆధ్వ ర్యంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో నిర్వహించే గ్రూప్-1 ప్రిలి మినరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని మేడ్చల్-మల్కా జిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలపై అధికా రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష లకు 131 పరీక్ష కేంద్రాలలో 53,964 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా అధికార యంత్రాంగం, పోలీసులు, విద్య, వైద్యశాఖల అధికారులు ఆయా కేంద్రాల వద్ద అన్ని రకాల వసతులు కల్పించాలని సూచించారు. పరీక్షలను పకడ్భందీగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని రకాల ఏర్పాట్లు చేయాల్సిందిగా పేర్కొన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో మంచినీటి వసతితో పాటు కేంద్రాల్లో అవసరమైన ఫర్నీచర్, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలనీ, పరీక్ష కేంద్రాలకు ప్రత్యేకంగా బస్సులను నడపాలని పేర్కొన్నారు. పరీక్షలు జరిగే సమయంలో విద్యత్తు సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని విద్యుత్తు శాఖ అధికారులకు సూచించారు. ప్రతి పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనీ, రాబోయే రోజుల్లో టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో మరిన్ని నోటిఫికేషన్లు రావడంతో పాటు పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. దీని దృష్ట్యా ఇప్పటి నుంచే అన్ని రకాలుగా అధికార యంత్రాంగం సన్నద్దం కావాలని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, రాచకొండ ఏసీపీ రష్మీ పెరుమాళ్, జిల్లా విద్యాశాఖ అధికారిణి విజయకుమారి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కిషన్, ఆయా మండలాల తహశీల్దార్లు, రవాణా, ఆర్టీసీ, విద్యుత్తు శాఖలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.