Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అడ్డుకుంటే దేశవ్యాప్తంగా ఉద్యమం తప్పదని ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు తాడిశెట్టి పశుపతి హెచ్చరించారు. శనివారం హిమాయత్‌నగర్‌లోని అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అడ్డుకోవాలని స్వార్ధ రాజకీయ పార్టీలు, స్వార్ధ కుల సంఘాల నాయకులు సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం దుర్మార్గం అన్నారు. ఏడు దశాబ్దాల నుంచి రిజర్వేషన్లను తొలగించాలని తమ సామాజిక వర్గాలు ఎప్పుడు ప్రభుత్వాలకు, కోర్టులకు విన్నవించలేదన్నారు. విద్యా, ఉద్యోగ ప్రభుత్వ ప్రయోజనాలు అందక చాలీ చాలని దయనీయమైన ఆర్థిక పరిస్థితులను అనుభవిస్తూ కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడి తమలో తాము కుమిలి పోయారే తప్ప ఇతర కులస్తులకు కల్పిస్తున్న ప్రయోజనాలను అడ్డుకోలేదన్నారు. ప్రజాస్వామ్య భారతదేశంలో ఏ వర్గం వారైనా వారికి కావాల్సిన హక్కుల కోసం పోరాడటం తప్పు కాదన్నారు. ఎదుటివారి హక్కులకు భంగం కల్పించాలని అనుకోవడం హేయమైన చర్య అన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అడ్డుకోవడం కోసం ఏ రకమైన దుశ్చర్యలకు రాజకీయ పార్టీలు, దుష్టశక్తులు వత్తాసు పలికితే తమ రిజర్వేషన్లను, హక్కులను కాపాడుకోవడం కోసం దేశవ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగులు, మేధావులు లక్షలాది మందితో సంఘటితమై ఉవ్వెత్తున పోరాటం చేయడానికి వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు.