Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యలు పరిష్కరించేవరకు పోరాటం ఆగదంటున్న స్టూడెంట్స్
- గతంలో ఇచ్చిన హామీలు నెవరేర్చాలని డిమాండ్
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీలోని మెస్‌లలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, విద్యార్థులకు అధికారులు గతంలో చ్చిన హామీలు నెరవేర్చాలని ఇక్కడి స్టూడెంట్స్ కోరుతున్నారు. వాటిని నెరవేర్చే వరకు తమ పోరాటం ఆగదంటున్నారు. ఇటీవల సమస్యల పరిష్కారానికి పలుమార్లు రోడ్డెకాల్సి వచ్చిందని, అయినా అధికారుల్లో చలనం లేదని అంటున్నారు. హాస్టల్స్‌లలో మౌలిక వసతుల కల్పన, నాణ్యమైన మెనూ తదితర సమస్యలు చాలా కాలంగా పరిష్కారం కావడం లేదు. దీనిపై ఇటీవల విద్యార్థినులు ఒకరోజంతా ఆందోళనకు దిగారు. రాస్తారోకో నిర్వహించారు. అయినా అధికారులు హామీలు ఇవ్వడం తప్ప పరిష్కారం మాత్రం చూపడం లేదు. పైగా తమ సమస్యలు పరిష్కరించాలని రోడ్డెక్కితే విద్యార్థుల ఆందోళన వెనుక ఎవరో ఉన్నారంటూ సమస్యలు పరిష్కరించకుండా విద్యార్థుల పోరాటాలను వక్రీకరిస్తున్నారని ఇక్కడి విద్యార్థులే చెప్తున్నారు.
ఈ విద్యా సంవత్సరం ఓయూలోని హాస్టల్స్‌లలో అమ్మాయిలు గతంకంటే ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు రావడంతో వారికి మొన్నటి వరకు సెల్టర్ ఇవ్వడం కూడా అధికారులకు తలనొప్పిగా మారింది. ఓ వైపు షెల్టర్ సమస్య, మరోవైపు సమస్యలతో ఆరు నెలల కిందట విద్యార్థులు ఆందోళనకు దిగితే మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ జస్టిస్ చంద్రయ్య ఓయూను సందర్శించారు. నిజాం కళాశాల విద్యార్థుల బ్లాక్‌కు వెళ్లి విద్యార్థినులతో ముఖాముఖి చర్చించి సమస్యలు తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సెప్టెంబర్ 12, 19 తేదీలలో నాంపల్లి కోర్టు జడ్జి రాధికా జైస్వాల్ ఓయూకు వచ్చారు. లేడీస్ హాస్టల్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేరోజు ఆహారం నాణ్యతగా లేదని, అన్నంలో గాజు పెంకులు వచ్చాయని విద్యార్థులు రాస్తారోకో కూడా చేశారు. మెయిన్ హాస్టల్లో క్వాలిటీ మెస్ పెట్టాలని, ఆదివారం రాత్రిపూట కూడా అన్నం పెట్టాలని, సిబ్బంది దురుసు ప్రవర్తన మానుకోవాలని ఓయూ లా కాలేజీ స్టూడెంట్స్ ఏకంగా మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. అదే విద్యార్థులు గత్యంతరంలేక ఇచ్చిన వినతిపత్రం వెనక్కి తీసుకోవడం గమనార్హం. హాస్టల్స్ మెస్ నాణ్యత విషయంలో పర్యవేక్షణ కరువైంది. టిఫిన్స్ కోసం పెద్దసంఖ్యలో బారులు తీరాల్సి వస్తోంది. వాషింగ్రూములు, మరుగుదొడ్లు సరిపోవడం లేదు. అపరిశుభ్రంగా ఉంటున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. ఈనెల 14న పీహెచ్డీ విద్యార్థులు మెస్‌లో క్వాలిటీ లేదని ఆందోళకు దిగారు. గేటుకు తాళంవేసి నిరసన తెలిపారు. పీహెచ్డీ మెస్‌లు గతంలో మాదిరిగా విభజించాలని, నాన్ బోర్డర్స్ సమస్య పరిష్కరించాలని కోరారు.
తమ సమస్యలు పరిష్కరించాలని కోఠి ఉమెన్స్ కళాశాల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల వారు ప్రిన్సిపాల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. హాస్టల్స్ డ్రయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, దుర్వాసన వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్స్‌లో, క్లాస్ రూముల్లో మంచినీటి సౌకంర్య ఉండటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లైబ్రరీ సమయం పెంచాలని, సరిపడా బుక్స్ అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఓయూ సెంటినరి హాస్టల్ విద్యార్థినులు కూడా సెంటినరి హాస్టల్ విద్యార్థినులు తమను అదే హాస్టల్లో కొనసాగించాలని, సమస్యలు పరిష్కరించాలని, సెలవుల్లో ఇక్కడే ఉండి పోటీ పరీక్షలకు ప్రీపేర్ అవుతామని, మెస్ సౌకర్యం నిలిపివేయకూడదని, వైఫై సౌకర్యం కల్పించాలని కోరారు. గత శనివారం ఉదయం10 నుండి మరుసటిరోజు తెల్లవారుజాము 5 గంటల వరకు రాస్తారోకో చేపట్టారు. అయినా తమ సమస్యలు పరిష్కారం కాలేదని చెప్తున్నారు. సమస్యలు పరిష్కారం అయ్యేదాకా తాము పోరాడతామని మళ్లీ ఉద్యమానికి సిద్ధ: అవుతామని హెచ్చరిస్తున్నారు. అధికారులు ఏ మేరకు స్పందిస్తారో చూడాలి మరి.