Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిబంధనలపై ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
బస్‌బేలను ఆక్రమించవద్దని, నగరంలో సాఫీగా ప్రయాణం సాగేవిధంగా సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు. ఈ మేరకు సోమవారం ఆటోడ్రైవర్లకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో పలు ప్రాంతాలల్లో ట్రాఫిక్ జామ్‌లు తప్పడం లేదన్నారు. ఇదిలా ఉండగా నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరగడంతో కొన్ని సందర్భాలల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందన్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో టి.పురుషోత్తంరావు ఆధ్వర్యంలో పలు కూడళ్లలో ఆటోడ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఆటో స్టాండ్స్ తప్పని సరిగా జంక్షన్లకు 100 మీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలని కోరారు. బస్టాండ్స్లోని బస్బేలల్లో ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నిలుపుతారని, అక్కడ ఆటోలు పెట్టడంతో ప్రయాణీకులకు, బస్సులకు ఇబ్బందులు కలుగుతాయన్నారు. బస్‌బేలకు 50 మీటర్ల దూరంలో ఆటోలు నిలుపాలని కోరారు. సీటీలోకి వెళ్లేందుకు ఇతర జిల్లాలకు (ఇతర జిల్లా రిజిస్ట్రేషన్ ఆటోలు) చెందిన ఆటోలకు అనుమతులు లేవన్నారు. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ నిబంధనలు పాటించాలన్నారు. ట్రాఫిక్ జామ్‌లు, రోడ్డు ప్రమాదాల నివారణకు సహాయసహకారాలు అందించాలని సీఐ పురుషోత్తం కోరారు. ఈ కార్యక్రమంలో ఆటోడ్రైవర్లు, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.