Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెరువుల్ని తలపించిన రోడ్లు పొంగిపొర్లిన నాలాలు
- వాహనదారులకు తప్పని ఇబ్బందులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లో సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం దంచికొట్టింది. ఏకధాటిగా రెండుమూడు గంటలు కురిసిన వర్షంతో పలు ప్రాంతాలు, రోడ్లు జలమయం అయ్యాయి. రోడ్లు చెరువులను తలపించాయి. నాలాలు పొంగిపొర్లాయి. రోడ్లపై భారీగా మురుగు నీరు చేరింది. కుండపోత వర్షంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. యూసుఫ్‌గూడ, పంజాగుట్ట, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో రోడ్లపై నీరు పారింది. పాతబస్తీతోపాటు శంషాబాద్, గండిపేట్, కిస్మత్‌పురా, అత్తాపూర్, మణికొండ, నార్సింగ్, లంగర్‌హౌజ్, గోల్కొండ, కార్వాన్, జియాగూడా తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, కవాడీగూడ, గాంధీనగర్, జవహర్‌నగర్, రామంతాపూర్, ఉప్పల్ భారీగా వర్షం కురిసింది. రోడ్లపై నిలిచిపోయిన వర్షం నీటితో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. నాంపల్లి, గోశామహల్, ఖైరతాబాద్, కోఠి, లక్డీకాపూల్, బషీర్‌భాగ్ నారాయణ గూడ, అఫ్జల్ గంజ్, మల్లెపల్లిలో నాలాలు పొంగిపొర్లాయి. వర్షం నీటితో రోడ్లు నిండిపోవడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక మెహదీపట్నం, సరోజినీదేవి కంటి ఆసుపత్రి, ఎన్ఎండీసీ నుంచి మాసబ్‌ట్యాంక్ వరకు భారీ ట్రాఫిక్ నిలిచిపోయింది. అప్రమత్తమైన హైదరాబాద్ జాయింట్ సీపీ, ట్రాఫిక్ బాస్ రంగనాథ్ వాహనదారులను అలర్ట్ చేశారు. పురాతన భవనాలు, బలహీనమైన భవంతులు, గోడలకు దూరంగా ఉండాలన్నారు. అత్యవసర సహాయం కోసం డయల్ 100కు ఫోన్ చేయాలని కోరారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు సూచించారు. ఇదిలావుండగా భారీ వర్షాలతో జలమండలి ఎండీ దానకిషోర్ అధికారులను అప్రమత్తం చేశారు. సహాయక చర్యలు పాల్గొనాలని ఆదేశించారు.
నీట మునిగిన మూసారాంబాగ్ వంతెన
నగరంలో కురిసిన భారీ వర్షానికి అంబర్‌పేటలోని మూసారాంబాగ్ వంతెన మరో సారీ నీట మునిగింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరడంతో మూసారాంబాగ్ వంతెనపై నుంచి ప్రవహిస్తున్నాయి. దాంతో వంతెన నీట మునిగింది. వంతెనకు ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు వాహనాలను గోల్నాక వంతెన మీదుగా మళ్లించారు.