Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
కూకట్పల్లి జోన్ పరిధిలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు వెంటనే విడుదల చేయాలని కాంట్రాక్టర్లు కోరారు. ఈ మేరకు సోమవారం కూకట్పల్లి జోనల్ కార్యాలయంవద్ద ధర్నా నిర్వహించారు. బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. కూకట్పల్లి, మూసాపేట్ జంట సర్కిల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ... గత సంవత్సరం నుంచి చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు సుమారు రూ. 800 కోట్లు ఉన్నాయని తెలిపారు. బిల్లులు రాక కాంట్రాక్టర్లు చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. వాటిని త్వరగా చెల్లిస్తేనే పనులను కొనసాగిస్తామన్నారు. అప్పటి వరకు పనులను పూర్తిగా నిలిపివేశామని తెలియజేశారు. కొంతమంది కాంట్రాక్టర్లు మానసిక ఒత్తిడి భరించలేక చనిపోయిన సంఘటనలు ఉన్నాయన్నారు. ఒక్కో కాంట్రాక్టర్ నుంచి మూడు కోట్ల వరకూ బిల్లులు బకాయి ఉన్నా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని వాపోయారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 30 సర్కిల్స్ లో పనులను 15వ తేదీ నుండి పూర్తిగా ఆపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం కాంట్రాక్టర్స్ జోనల్ కమీషనర్ మమతను కలిసి బిల్స్ చెల్లించమని వేడుకున్నారు. దీంతో ఆమె సానుకూలంగా స్పందించి కమిషనర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మురారి, శంకర్, ఐలయ్య, మల్లేశం, లక్ష్మీకాంత్, గణేష్, రేపన్ గిరిబాబు, సాయిబాబా, శివ కుమార్‌గౌడ్, ప్రసాద్ నాయక్, బొంత యాదగిరి తదితరులు పాల్గొన్నారు.