Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదివారం అర్ధరాత్రి తర్వాత కామినేని హాస్పిటల్ నుంచి అపోలో హాస్పిటల్‌కు గుండె తరలింపు
- నాగోల్ టు జూబ్లీహిల్స్‌కు గ్రీన్‌ఛానల్ ఏర్పాటు
- సహకరించిన హైదరాబాద్ మెట్రో అండ్ పోలీసులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
కేవలం 25 నిమిషాలు.. నాగోల్ టు జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు గ్రీన్ ఛానల్ ద్వారా మెట్రోరైల్లో గుండెను తరలించిన సమయమిది. ఒకరి ప్రాణం కాపాడేందుకు ఆస్పత్రి యాజమాన్యాలు, డాక్టర్లు తీసుకున్న నిర్ణయానికి పూర్తిగా సహకరించిన మెట్రో సంస్థ సేవా దృక్పథానికి నిదర్శనమిది.
నల్లగొండ జిల్లా, మటంపల్లికి చెందిన 'బి' పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కలిగిన ఓ 33 ఏండ్ల వ్యక్తి మెదడుకు తీవ్ర గాయం అయింది. ఎల్బీనగర్లోని కామినేని హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. కానీ అతనికి బ్రెయిన్‌డెత్ అయింది. దీంతో ఆయన గుండెను డాక్టర్లు కామినేని హాస్పిటల్లో సేకరించి జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్లో అవసరమైన ఒక రోగికి అమర్చేందుకు నిర్ణయించారు. చనిపోయిన వ్యక్తి నుండి సేకరించిన గుండెను మెట్రో రైలు సంస్థను సంప్రదించి ప్రత్యేకంగా గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి రవాణా చేశారు. సెప్టెంబర్ 26న అర్ధరాత్రి తర్వాత సేకరించిన గుండెను నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్‌కు కేవలం 24 నిమిషాల్లోనే ప్రత్యేక రైలు ద్వారా తరలించారు.
బ్రెయిన్ డెత్తో చనిపోయిన వ్యక్తి గుండెను తెచ్చి అమర్చిన 32 ఏండ్ల వ్యక్తి హృద్రోగి, ఆయన డెక్లేలేటెడ్ కార్డియోమయోపతితో బాధపడుతున్నాడు. మూడు నెలల కిందట విషమ పరిస్థితిలో అపోలో హాస్పిటల్స్‌కు వచ్చాడు. తీవ్ర గుండె వైఫల్యంవల్ల మూత్రపిండాల వైఫల్యం ఏర్పడి తక్కువ రక్తపోటుకు దారితీసింది. ఒకవైపు చనిపోయిన వ్యక్తి గుండె కోసం పరిశీలన చేస్తూనే, రోగి శరీరంలోకి నిరంతరం మందులు పంపిస్తూ అతన్ని సజీవంగా ఉంచారు. ప్రముఖ గుండెవైద్య నిపుణులు, అపోలో హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్, కార్డియోథొరాసిక్, ట్రాన్స్‌ప్లాంట్ అండ్ మినిమల్ యాక్సెస్ సర్జన్ డాక్టర్ ఎ.జి.కె గోఖలే ఇతర వైద్య బృందంతో కలిసి రోగికి గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు.
నగరంలో అస్ట్రేలియా వర్సెస్ ఇండియా మ్యాచ్ జరుగుతున్నందున, అవయవాన్ని కామేనేని హాస్పిటల్ నుంచి అపోలో తరలించడం పెద్ద సమస్యగా మారిందని, ఆ సందర్భంగా తాము ఎల్ అండ్ టి మెట్రోను సంప్రదించగా వెంటనే స్పందించి సహకరించారని, పోలీసులు మెట్రో స్టేషన్ నుండి హాస్పిటల్ వరకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారని గోఖలే తెలిపారు. హైదరాబాద్ పోలీసులకు, ప్రత్యేకంగా గ్రీన్‌ఛానెల్ ఏర్పాటు చేసి, అతి తక్కువ సమయంలోనే అత్యంత వేగంగా గుండెను తరలించినందుకు ఎల్ అండ్ టి హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థకు డా ఎ.జి.కె గోఖలే కృతజ్ఞతలు తెలియజేశారు.
గతంలోనూ ఒకసారి..
హైదరాబాద్‌వాసులకు అవసరమైన సహాయం చేయడానికి తామెప్పుడూ ముందే ఉంటామని మరో మారు ఎల్ అండ్ టి హైదరాబాద్ మెట్రోరైల్ నిరూపించింది. గతంలోకూడా అంటే ఫిబ్రవరి 2021లో ఏ విధంగానైతే జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్ నుంచి ఓ ప్రాణం కాపాడటానికి గుండెను తరలించాలని ఎల్ అండ్ టీ ఎంఆర్హెచ్ఎల్ ఎస్ఓఎస్కాల్ అందుకుందో అదే విధంగా సెప్టెంబర్ 26న కూడా మరోసారి ఎమర్జెన్సీ ఫోన్‌కాల్ అందుకుంది. దానికనుగుణంగా సెప్టెంబర్ 26న ఆదివారం తెల్లవారుజామున (సోమవారం) గ్రీన్ ఛానెల్ ఏర్పాటుచేసింది. నాగోల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషన్‌కు గుండెను రవాణా చేసింది.
ఈ సందర్భంగా ఎల్ అండ్ టీఎంఆర్హెచ్ఎల్ ఎండీ-సీఈఓ కెవీబీ రెడ్డి మాట్లాడుతూ... ''ప్రయాణికుల సేవకు హైదరాబాద్ మెట్రో రైల్ కట్టుబడి ఉండటం మాత్రమే కాదు, అవసరమైనప్పుడు మరింతగా వారికి సేవలను అందించేందుకు కట్టుబడి ఉంది. మా అవసరం ఎక్కువగా ఉన్నవారికి, అవసరమైన సమయంలో తోడుండాలనేది మా ప్రధాన ఉద్దేశం. ఈ సారి కూడా మేము గ్రీన్‌ఛానెల్ ఏర్పాటుచేయడంతో పాటుగా వీలైనంత త్వరగా గుండెను తరలించి, ఓ ప్రాణం కాపాడగలిగాం. ప్రాణంతో ఉన్న అవయవాన్ని తరలించడంలో తోడ్పడిన డాక్టర్లు, హెచ్ఎంఆర్ సిబ్బందికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం'' అని అన్నారు.